వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం.. టీడీపీ ముందున్న ప్రధాన లక్ష్యం. నిండు సభలో చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞకు తోడు.. పార్టీని నిలబెట్టుకునేందుకు సైతం.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం.. అధికారంలోకి రావాల్సిన అవసరం రెండు ఈ పార్టీపై ఉన్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గాలపై చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష చేస్తున్నారు. ఇంచార్జ్‌ల పనితీరు.. పాత, కొత్తల కలబోత-వడబోత.. ఇలా అనేక అంశాలపై చర్చిస్తున్నారు. చివరకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వారంలో 18 నియోజకవర్గాల నుంచి ఇంచార్జ్‌లను పిలిచి చర్చించారు. దీనికి గాను ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనితలతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
వీరు తొలుత ఆయా నియోజకవర్గాల పరిశీలకుల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా రోజుకు ముగ్గురు చొప్పున నియోజకవర్గాల ఇంచార్జ్‌లు.. ఆశావహులతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వారు ఏ విధంగా పనిచేస్తున్నారో వివరిస్తున్నారు. చివరకు.. అభ్యర్థుల విషయాన్ని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు 18 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పిలిచి మాట్లాడినా.. కేవలం 4 నియోజకవర్గాల్లోనే ఖరారు చేయడం గమనార్హం.
మిగిలిన 14 నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య సమన్వయ లేమి.. ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలు చేసుకోవడం.. బలమైన సామాజిక వర్గాల మధ్య వ్యూహాత్మక పోటీ.. రాజకీయ గ్యాప్.. కార్యకర్తల సమన్వయ లేమి.. వంటివి తెరమీదికి వచ్చాయి. దీంతో ఆయా నియోజకవర్గాల పరిస్థితిని పెండింగులో పెట్టారు. అంటే మొత్తంగా తేల్చినవాటితో చూసుకుంటే.. తేల్చాల్సినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పటికి సరిదిద్దుతారో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates