కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే అసలు ప్లానా ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిపై అనేకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ విశ్లేషణలు పార్టీ నేతల చర్చల్లో కూడా దొర్లుతున్నాయి. ఇంతకీ అలాంటి విశ్లేషణల్లో ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ ఏమిటంటే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాడినికే నరేంద్రమోడీ పెద్ద ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే అతివాదిగా పాపులరైన బండి సంజయ్ ను అర్ధాంతరంగా అధ్యక్షస్ధానం నుండి తప్పించారట. మితవాదిగా పేరున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావటం అన్నది కలలో మాటగా అగ్రనేతలకు అర్ధమైపోయిందట. ఒకపుడు బీజేపీకి ఉన్న ఊపు ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణాలో రాజకీయ సమీకరణలు చాలావేగంగా మారిపోతున్నాయి. ఒకపుడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన నేతలు కూడా మళ్ళీ పార్టీలో చేరుతున్నారు. అలాగే సొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి లాంటి గట్టినేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు.

ఇక బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, జితేందర రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఈటల, కోమటిరెడ్డికి పదవులు దక్కాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి మారకపోవచ్చు. మరి మిగిలిన నేతల పరిస్దితి ఏమిటి ?

ఇదంతా చూసిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమని తేలిపోయింది. అందుకనే అధికారంలోకి వచ్చేస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ అవకాశాలను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ తో చేతులు కలపాల్సిందే అని మోడీ నిర్ణయించినట్లు సమాచారం. జాతీయస్ధాయిలో బీజేపీకి ఎప్పటికైనా కాంగ్రెస్ తోనే సమస్య కానీ బీఆర్ఎస్ తో కాదు. అందుకనే కాంగ్రెస్ ను ముందు తెలంగాణాలో దెబ్బకొట్టడానికే మోడీ నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే బండిని తీసేసి కిషన్ కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఎవరి వ్యూహాలు వర్కవుటవుతాయో చూడాల్సిందే.