టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఒకసారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గంటాకు ఉంది. అంతేకాదు, నాలుగు సార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు గంటా. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాసరావు రాబోయే ఎన్నికలలో కూడా టిడిపి తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, దాదాపుగా 2024 ఎన్నికల గంటాకు చివరి ఎన్నికలు కావచ్చు అని ప్రచారం జరుగుతుంది.
తన రాజకీయ వారసుడిగా తనయుడు గంటా రవితేజను ప్రమోట్ చేసేందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లకు తగ్గట్టుగానే గత వారం రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో రవితేజ చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న రవితేజ హఠాత్తుగా లోకేష్ వెంట పాదయాత్రలో నడవడంతో రవితేజ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తెను రవితేజ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయనకు రాజకీయ వారసుడిగా అటువైపు నుంచి కూడా రవితేజ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరులో లోకేష్ పాదయాత్ర సందర్భంగా గంట రవితేజ యాక్టివ్ గా పాల్గొంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా రవితేజ ముందుకు వెళ్తున్నారా అన్న ప్రచారం కూడా మొదలైంది.
మరోవైపు నారాయణ కూడా అనారోగ్య కారణాల రీత్యా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే రవితేజను తన స్థానంలో నారాయణ పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతుంది.