‘కోడికత్తి’ శ్రీను నిరాహార దీక్ష?

2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు, వైసీపీనే ఆ దాడి చేయించిందని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, ఈ కోడి కత్తి దాడి అంతా డ్రామా అని, పీకే ప్లాన్ లో భాగంగానే కోడికత్తి దాడి జరిగిందని టీడీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శించారు. ఆ దాడి ఘటన తర్వాత శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం తర్వాత శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు గతంలో బెయిల్ ఇవ్వగా ఆ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.

దీంతో, శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరోసారి వాదనలు వినిపించారు. అయితే, ఈ వ్యవహారంపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న శ్రీనివాస్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలోనే తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే నిరాహారదీక్ష చేపట్టే యోచనలో ఉన్నాడు. జులై 11 నుంచి జైల్లో దీక్ష చేసేందుకు శ్రీను సిద్ధమవుతున్నాడని ఆయన తరఫు లాయర్అబ్దుల్ సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల నుంచి తన క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని, కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని ఆయన కోరారు. షెడ్యూల్ ప్రకటించకుంటే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని అన్నారు. మరి, ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.