ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్రమైన చర్చ మొదలైంది. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఏపీలో బీజేపీ ఉందా లేదా అన్నట్లు తయారవడమే కాకుండా వైసీపీకి బీ టీమ్ అన్నట్లుగా మారిపోయింది. ఈ కారణంగానే జనసేన, బీజేపీ మధ్య కూడా రాష్ట్ర స్థాయిలో పూర్తిగా దూరం పెరిగిపోయింది. మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ను పిలిపించుకోవడం వంటి గెశ్చర్లతో జనసేన, బీజేపీ మిత్రపక్షాలే అన్నట్లుగా కనిపించినా అదే విశాఖలో పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు పవన్ కానీ, స్థానిక జనసేన నాయకులు కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేదని తేలిపోయింది.
ఇక నిన్నమొన్నటి లెక్కులు చూసుకుంటే చంద్రబాబుతో ఒకట్రెండు భేటీలతో పవన్ టీడీపీకి చేరువగా కనిపించినా ఆ తరువాత మొన్నటి వారాహి యాత్రతో ఇండిపెండెంట్‌గా ప్రయాణిస్తున్నట్లు అనిపించారు. అయితే… ఇప్పుడు బీజేపీ ఏపీలో పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించడంతో రాజకీయ సమీకరణలు మారుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అనుకున్నట్లుగానే పవన్ అధికారికంగా పురంధేశ్వరికి అభినందనలు చెప్తూ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ‘బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవికి నియమితులైన శ్రీమతి డి.పురందేశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందనలు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం గల పురంధేశ్వరిగాు ఈ కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకెళ్తారని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
నిన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు కూడా పవన్‌పై ఎన్నడూ విమర్శలు చేయనప్పటికీ వీర్రాజు వైసీపీ అనుకూల వైఖరి కారణంగా పవన్ ఆయన్ను చేరనివ్వలేదు. పవన్ నిత్యం వైసీపీని, జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఇక పురంధేశ్వరి విషయానికొస్తే మొన్నటి ఎన్నికల సమయానికే బీజేపీలో ఉన్నారామె. అయితే, అప్పటికి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు వైసీపీలో పనిచేశారు. ఎన్నికల తరువాత వారు కూడా వైసీపీకి దూరమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మాస్టర్ మైండ్‌గా పేరుండగా పురంధేశ్వరి కార్యదక్షురాలు. దీంతో పురందేశ్వరి ఏపీలో బీజేపీకి కొత్త జీవం ఇస్తారని.. జనసేన, బీజేపీ మైత్రి కూడా ఇక రాష్ట్రస్థాయిలో బలపడుతుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates