రచ్చ చేయలేరు.. రాబట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఉంటే మౌనంగా ఉండడం లేకుంటే.. వేరే దారి చూసుకోవడం! ఇదీ.. వైసీపీలో కొందరు నాయకుల పరిస్థితి! వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్.. పైకి 15 నుంచి 20 మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం 30 మంది వరకు ఉన్నారని స్వయంగా ఆయనే వెల్లడిస్తున్నారు. వీరికి టికెట్లు ఇస్తే.. కష్టమనే భావన ఆయనలో ఉందని సమాచారం.
ఈ జాబితాలో కీలక నాయకులు సహా.. కొందరు నియోజకవర్గాలు మారిన వారు.. మరికొందరు యువ నాయకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ఉమ్మడి విజయనగరంలోని ముగ్గురు నేతలకు టికెట్లు కష్టమనే భావన వినిపిస్తోంది. వీరిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి టికెట్ దక్కే అవకాశం లేదని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి మానసికంగా కూడా కోలగట్ల రెడీ అయిపోయినట్టు సమాచారం.
రచ్చచేసినా.. ప్రయోజనం లేదని.. తనకు సంబంధించి ఏమైనా రాబట్టుకుంటే సరిపోతుందని కోలగట్ల నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇక, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఎప్పుడో తప్పించే జాబితాలో చేరిపోయారు. ఏదో ఈ మధ్య జనసేన అంటూ.. ఆయన హడావుడి చేసినా.. ప్రయోజనం లేదని వెనక్కి తగ్గారు. ఈయన స్థానంలో బల్లి కళ్యాణచక్రవర్తికి ( ప్రస్తుత ఎమ్మెల్సీ) టికెట్ ఇవ్వనున్నారట. దీంతో వర ప్రసాద్ కొన్ని రోజులు యాగీ చేసినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఫుల్లుగా సైలెంట్ అయ్యారు.
గిద్దలూరు, నెల్లిమర్ల, కైకలూరు, నందిగామ, నెల్లూరు సిటీ, డోన్(బుగ్గన), పత్తికొండ, పాణ్యం, కర్నూలు ఇలా అత్యంత కీలకమైన నియోజవకర్గాల్లోనూ అనూహ్యమైన మార్పులు తప్పవని సీనియర్లే తమ అంతర్గత చర్చల్లో చెప్పుకోవడం గమనార్హం. ఎందుకంటే.. ఇటు.. విజయనగరంలో టీడీపీని బలంగా ఎదుర్కొనలేక పోతున్నారనేవాదన.. అటు సీమలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారనే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వీరికి పార్టీ బాధ్యతలు అప్పగించి.. టికెట్లు వేరేవారికి ఇచ్చే దిశగా పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ విషయంపై క్లారిటీ ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates