మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం శివసేనలో చీలిక రావడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న ఏకనాథ్ షిండే…ఉద్ధవ్ థాకరే పై తిరుగుబాటు చేసి పార్టీని, సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి మహా రాజకీయాల్లో అదే తరహా హైడ్రామా రక్తి కట్టింది.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఆయన అన్న కొడుకు అజిత్ పవర్ చీల్చారు. పార్టీలోనే 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన అజిత్ వార్ తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 30 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసిన అజిత్ పవార్ తనకు దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. అంతకుముందు, మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం అజిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు, తాజాగా అజిత్ పవార్ ఇచ్చిన షాక్ నుంచి శరద్ పవార్ తేరుకోలేకపోతున్నారట. ఏడాది సమయంలోనే ఎన్సీపీకి రెండో షాక్ తగలడం గమనార్హం. గత ఏడాది జూన్ లో షిండే మహా అఘాడీ వికాస్ ను చీల్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, అజిత్ పవర్ ఎన్సీపీలో చీలిక తేవడం ఇది తొలిసారి కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ ఆయన మద్దతు ప్రకటించారు. అప్పట్లో, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆ తర్వాత శరద్ పవార్ మంత్రాంగంతో అజిత్ వెనక్కి తగ్గారు.