పబ్లిక్‌లో చాలా కూల్‌గా కనిపించే తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే ఆగ్రహంగా ప్రవర్తించారు. కేటీఆర్ చేయి పట్టుకుని బతిమలాడుకునే ప్రయత్నం చేసిన ఆ ఎమ్మెల్యే చేతిని విదిలించుకుని ఆయన మొఖం కూడా చూడకుండా పక్కనే ఉన్న పోలీసులకు ఏదో ఆదేశాలు ఇస్తూ వెళ్లిపోయారు కేటీఆర్. మహబూబబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహబూబాబాద్‌లో పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడానికి కేటీఆర్ శుక్రవారం వెళ్లారు. ఆయన తన కాన్వాయ్ దిగి సభ ఏర్పాటు చేసిన చోటికి వెళ్తుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనుకే పరుగుపరుగున వస్తూ కేటీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే, కేటీఆర్ మాత్రం శంకర్ నాయక్ చేతిని విదిలించుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతులు జోడిస్తూ కేటీఆర్ వెంట వెళ్లినా ఆయన మాత్రం పట్టించుకోలేదు.
శంకర్ నాయక్‌కు స్థానికంగా మిగతా నాయకులతో ఏమాత్రం పొసగదు. ఈ విషయంలో ఆయనపై నిత్యం పార్టీ పెద్దలకు కంప్లయింట్లు అందుతూనే ఉంటాయి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌తో శంకర్ నాయక్‌కు విభేదాలున్నాయి. గతంలో పలుమార్లు సభావేదికలపై కవిత, సత్యవతి రాథోడ్‌లతో ఆయన దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.
స్థానికంగా శంకర్ నాయక్ వివాదాస్పద తీరు, పార్టీలో ఆయనపై వస్తున్న ఫిర్యాదుల కారణంగా కేటీఆర్ ఆగ్రహించారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కేటీఆర్ రావడానికి ముందే ఈ సూచన అందడంతో శంకర్ నాయక్ ఆయన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని, కానీ కేటీఆర్ మాత్రం ఆయన్ను యాక్సెప్ట్ చేయలేదని అంటున్నారు. కేటీఆర్ తాజా తీరుతో శంకర్ నాయక్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న ప్రచారం మొదలుపెట్టారు పార్టీలోని ఆయన ప్రత్యర్థులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates