“వైసీపీ మంత్రులు, నాయకులు.. నను ప్యాకేజీ స్టార్ అంటున్నారు. నేను అమ్ముడు పోయానని చెబుతున్నారు. నేను ఇలా చేయాలని అనుకుంటే.. చాలా తేలికైన పని. ఇదే జరిగి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. లక్ష్యం పెద్దదైనప్పుడు.. భయపడాల్సిన అవసరం లేదని.. దాని కోసం పనిచేస్తే సరిపోతుందని అన్నారు. అందరం కలిసి కష్టపడి.. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని ఆయన కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జెండా ఎగరాలని… ఎగిరి తీరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సాధించడం.. చాలా కష్టమని నాకు తెలుసు. రుషులు యజ్ఞం చేస్తుంటే.. మారీచులు అడ్డు పడినట్టు వైసీపీ నాయకులు కూడా మన లక్ష్యానికి అడ్డు పడతారు. అయినా.. ముందుకుసాగాలి
అని పిలుపునిచ్చారు.
కాకినాడలో నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టం తెలిసిన బలమైన నాయకుడు కావాలని పవన్ ఆకాంక్షించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని తెలిపారు. ఈ లక్ష్య సాధన కష్టమేనని తెలుసు.. అయినా కూడా లక్ష్య సాధన దిశగా అందరూ పనిచేయాలి
అని కోరారు. తాను అమ్ముడుపోవాలనుకుంటే అది చాలా తేలికైన పని అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఏ పదవో.. ఏ మంత్రి పదవో అడిగితే సరిపోతుందన్నారు. కానీ తాను ఆలోచించేది కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు.
నాకు నిరాశ నిస్పృహలు ఉంటాయి.. కానీ కొంతమంది నాయకుల రాక వలన కొత్త ఉత్సాహం వస్తుంది
అని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రి కావడం అనే విషయాలను పక్కన పెడితే.. మార్పురావాలని కోరుకుంటున్నానని పవన్ చెప్పారు. వైసీపీ అధినేత , సీఎం జగన్ అంటే.. తనకు జాలి ఉందని అన్నారు. పాపం 16 నెలలు జైలులో ఉండి వచ్చాడుకదా! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.