ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గ్రాఫ్ ఢ‌మాల్‌…!

ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు అంటే.. ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీకి కంచుకోటలు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ భారీ ఎత్తున మెజారిటీ ద‌క్కించుకుంది. 2014లో క‌న్నా.. 2019లో ఒక్క కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం, రాజోలు(జ‌న‌సేన‌) మిన‌హా.. అన్ని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌యం సాధించింది. ఇది ఒక‌ర‌కంగా వైసీపీ సాధించిన రికార్డ‌నే చెప్పాలి. అయితే.. అనూహ్యంగా.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు గ్రాఫ్ త‌గ్గుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌ని పైకి క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా .. వారిలో కొంత అసంతృప్తి వ్య‌క్త‌మవుతోంది. ఎస్సీ రిజ‌ర్వేష‌న్‌లో కొంత భాగాన్ని వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి కేటాయించ‌డంతోపాటు.. వారికి ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేష‌న్ నిధులు కూడా స‌క్ర‌మంగా ఇవ్వ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఎస్సీ కార్ప‌రేష‌న్ ఏర్పాటు చేయ‌డంతోపాటు.. నిధులు కూడా ఇచ్చింది.

అదేస‌మ‌యంలో ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్య‌ను అభ్య‌సించేందుకు కూడా రుణాలు ఇచ్చింది. ఆర్థికంగా సాయం అందించింది. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. మంత్ర‌వ‌ర్గంలో ఉన్న ఎస్సీ నాయ‌కుల‌కు కూడా ఆశించిన మేర‌కు ప‌వ‌ర్స్ లేవ‌నే ప్ర‌చారం అంత‌ర్గ‌తంగా సాగుతోంది. కేవ‌లం వారు ఉత్స‌వ విగ్ర‌హాలు మాదిరిగానే ఉన్నార‌ని.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌లు  స‌హా.. ఎస్సీ క‌మ్యూనిటీలు నిర్వ‌హిస్తున్న స‌మావేశాల్లో ఇది స్ప‌స్టంగా తెలుస్తోంది.

దీంతో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి రెండు మిన‌హా.. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓటు బ్యాంకు కు గండి ప‌డుతోంద‌నే హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. అయితే. .గెలుపు ఓటముల విషయం ఇప్పుడే చ‌ర్చ‌కు రాకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు శాతం త‌గ్గితే.. అది ప్ర‌భుత్వ ఏర్పాటుపైనా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.