ఎంపీ ఎఫెక్ట్‌: విశాఖ‌లో వైసీపీకి మైన‌స్ నిజ‌మేనా ?

వైసీపీ కీల‌క‌నాయ‌కుడు.. తొలిసారి ఎంపీ అయిన‌.. విశాఖ పార్ల‌మెంటు స‌భ్యుడు ఎంవీవీ స‌త్యానారాయ‌ణ కుటుంబం, ఆయ‌న స్నేహితుడు కిడ్నాప్ అయిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్య‌వ‌హారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ సాగుతోంది. అయితే.. ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. వైసీపీపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే సెప్టెంబ‌రు నాటికి.. సీఎం జ‌గ‌న్ త‌న నివాసాన్ని(కాపురం) విశాఖ‌కు మార్చుకుంటాన‌ని.. గ‌తంలోనే చెప్పారు. అదేవిధంగా పాల‌న‌ను కూడా విశాఖ నుంచే నిర్వ‌హిస్తాన‌న్నారు. అయితే.. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న కిడ్నాప్ క‌థ‌.. జిల్లా వాసుల‌ను వ‌ణికిస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇసుక మ‌ట్టిభూముల విష‌య‌లో వైసీపీ నేత‌ల ఆగ‌డాలు పెరిగాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. దీనికితోడు.. ఎంపీ స్వ‌యంగా.. త‌న వ్యాపారాల‌ను హైద‌రాబాద్‌కుత ర‌లిస్తాన‌ని వెల్ల‌డించారు. దీంతో వైసీపీ ఉంటే.. ఇక్క‌డ అరాచ‌కం పెరుగుతుంద‌ని.. కొంద‌రు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు కానీ.. దీనిని ప్ర‌శాంతంగా ఉంచాల‌ని వారు కోరుతున్నారు.

అయితే.. ఈ విష‌యంలో విశాఖ‌కు చెందిన వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు. నిత్యం మీడియాకు ట‌చ్‌లో ఉండే మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నుంచి ఇత‌ర నేత‌ల దాకా ఎవ‌రూ కూడా స్పం దించ‌లేదు. దీనికి తోడు ఎంపీ విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది ప్ర‌భుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. దీంతో విశాఖ విష‌యంలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం వంటి వాటిపై అంత‌ర్మ‌థ‌నం చెందుతోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి విశాఖ‌లో అయితే..వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌నేది విశ్లేష‌కుల మాట‌.