ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం మలుపులపై మలుపులు తిరుగుతోందా? ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ మందగించేలా తెరవెనుక `కొన్ని శక్తులు` ప్రయత్నించాయ న్న టీడీపీ సహా విపక్షాల విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, ఇంకేముంది.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని ప్రకటించిన సీబీఐ కూడా ఇప్పుడు ఆయనను ప్రతి శనివారం విచారించి.. ఊరుకుంటోంది. ఇలా అనేక ట్విస్టులు ఈ కేసులో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగు చూసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి, బెయిల్‌పై బయట ఉన్న అప్పటి వివేకా డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని తనకు రాయబారాలు పంపుతున్నాయని బాంబు పేల్చాడు. తనను కొనేందుకు `కొందరు` ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పాడు. ` పెద్దమనుషుల`తో రాజీ అయితే డబ్బులు కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభ పెడుతున్నారి తెలిపాడు. తాను చావడానికైనా సిద్ధం.. కానీ రాజీ ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం గమనార్హం.
వివేకా దారుణ హత్యకేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని దస్తగిరి తెలిపారు. అయితే.. కొందరి విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ.. ప్రధాన పాత్రులు అందరూ అరెస్టు అవుతారని చెప్పారు. తనను లొంగతీసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దస్తగిరి చెప్పాడు. తాను ఎవరికీ లొంగేది లేదని ఆయన తేల్చి చెప్పాడు. తనకు కూడా ప్రాణ భయం ఉందని అయినా.. ఎవరో ఏదో ఇస్తారంటే మాత్రం తానేమీ లొంగిపోనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కూడా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. తనపై వైసీపీ నేతలు కక్షకట్టి వేధిస్తున్నారని వాపోయాడు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, అయినా.. తాను ఎవరికీ లొంగబోనని దస్తగిరి చెప్పడం గమనార్హం.