ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి, మాజీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అదినేత, సీఎం జగన్ కారణంగానే తనను బీజేపీ పెద్దలు ఏపీ అధ్యక్ష పదవి నుంచి దింపేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గా తాను ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వ రాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఐదుగురితో కమిటీ వేశానని, నిధుల దుర్వినియోగంలో తన పాత్రలేదని కన్నా తెలిపారు.
అయినా.. తనపై ఏదో ఒక కుట్ర చేసి.. పదవి నుంచి దింపేయడంలో జగన్ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసేదీ చంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రస్తుతం తాను సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్‌గా మాత్రమేనని ఉన్నానని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు తన గురించి చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ రాక్షస పాలన అంతంచేయాలనే టీడీపీలో చేరానని, అందుకే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నానని తెలిపారు.
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి ఒక దశ , దిశ అనేవి లేవని కన్నా వ్యాఖ్యానించారు. ముద్రగడ ఎప్పుడూ ఏ పని చేసినా తన వ్యక్తిగత ప్రాబల్యం కోసమే చేశారని ఆనాడు కాపులను ఆయన వాడుకున్నారని.. వ్యాఖ్యానించారు. ముద్రగడ మంత్రిగా ఉన్నప్పుడు కులం గురించి మాట్లాడ వద్దని తనతో చెప్పారని కన్నా మరో బాంబు పేల్చారు. తనకు ముద్రగడ మనస్తత్వం.. ఆయన రాజకీయ వ్యవహారం.. వ్యక్తిగత వ్యవహారం అన్నీ తెలుసునని. అందుకే ఆయనకు దూరంగా ఉన్నానని చెప్పారు.
తన రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని భావించినప్పుడల్లా ముద్రగడ రాజకీయంగా ఏదో ఒక అలజడి సృష్టిస్తారని.. కన్నా విరుచుకుపడ్డారు. కాపులకు మేలు చేసిన చంద్రబాబుకు ముద్రగడ ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా అని నిలదీశారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ చేపట్టింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల అంశంలో ద్రోహి ఎవరైనా ఉంటే అది జగనేనని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో 5 శాతం చంద్రబాబు కాపులకు ఇచ్చారని, కానీ జగన్ మాత్రం గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ కాపు రిజర్వేషన్లు వ్యతిరేకించారని.. దీనిని ఆనాడు ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ముద్రగడ కాపు ద్రోహి కాదా? అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates