‘తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డింది’

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్ క‌ర్నూలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన స‌భ‌లో తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు రువ్వారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి.. మ‌రీ పోరాడార‌ని.. అలా సాధించుకున్న తెలంగాణ‌ను కేసీఆర్ స‌ర్కారు నాశ‌నం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్ర‌భుత్వం .. కేంద్రంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. చెప్పారు.

వాస్త‌వానికి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఎంతో చేసింద‌ని న‌డ్డా చెప్పారు. భారీగా నిధులు ఇచ్చింద‌ని,గ‌త తొమ్మిదే ళ్ల‌లో వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును తెలంగాణ‌కు ఇచ్చింద‌ని.. అయితే.. ఈ నిధుల‌ను స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని న‌డ్డా దుయ్య‌బట్టారు. కిసాన్ స‌మ్మాన్ నిధితో కేంద్ర ప్ర‌భుత్వంతెలంగాణ‌లోని రైతుల‌ను ఆదుకున్న మాట నిజం కాదా? అని న‌డ్డా ప్ర‌శ్నించారు. కేంద్రంలో పాల‌న ప్రారంభించిన న‌రేంద్ర మోడీ.. దేశంలో పేద‌రికంపై యుద్ధం చేసి.. దానిని పార‌దోలే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్ర‌ధాని మోడీ కృషి చేస్తున్నార‌ని న‌డ్డా చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను కూడా రెడీ చేస్తున్నార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం మోడీవైపే ఉంద‌ని.. భార‌తీయులు అంద‌రూ మోడీ వెంటే న‌డుస్తున్నార‌ని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామ‌కాలు పేరుతో ఏర్ప‌డిన‌ తెలంగాణ‌లో ఇప్పుడు వీటిని ప‌ట్టించుకునే వారే లేకుండా పోయార‌ని.. కేసీఆర్ త‌న ఇంటికి నీళ్లు.. త‌న ఫామ్ హౌస్‌కు నిధులు.. త‌న కుటుంబానికి నియామ‌కాలు ఇస్తూ.. తెలంగాణ‌ను స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. న‌డ్డా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామ‌ని.. న‌డ్డా చెప్పారు. ఇక్క‌డి పేద‌రికాన్ని రూపుమాపేందుకు, రైతుల‌కు మేలు చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. కుటుంబ పాల‌న‌కు బీజేపీ వ్య‌తిరేక‌మ‌ని.. కేసీఆర్ కుటుంబ పాల‌న‌తో రాష్ట్రం అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉంద‌ని చెప్పారు. అందుకే కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడి బీజేపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.