కరోనా సమయంలో రవాణా సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం రమణక్కపేటకు చెందిన దుర్గ అనే గర్భిణీ రవాణా సౌకర్యం లేని కారణంగా రోడ్డుమీదే ప్రసవించింది.
ఆమె తిరువూరులోని తన సోదరి ఇంటికి వచ్చింది. మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి ఫోన్ చేశారు. ఓవైపు చాలాసేపటి వరకు రాకపోవడం, మరోవైపు ప్రయివేటు వాహనాలు లేకపోవడంతో ఆసుపత్రికి నడుస్తూ బయలుదేరింది. కొంతదూరం వచ్చాక రోడ్డుపై సొమ్మసిల్లింది. ఏఎన్ఎంలు సమాచారం అందుకొని అక్కడకు వచ్చి సపర్యలు చేశారు. అపస్మారకస్థితిలోని దుర్గకు సురక్షిత ప్రసవం చేశారు.
విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నం వద్ద 108 కోసం ఎదురుచూసిన ఓ వ్యక్తి చివరకు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిన ఓ వ్యక్తి 108 వాహనం కోసం రోడ్డు పైనే అరగంట వేచి చూశాడు. చివరకు అక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
ఎల్జీపాలిమర్స్ సమీపంలోని వెంకటాపురంకు చెందిన రవిశంకర్ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, అక్కడ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో 108కి ఫోన్ చేశారు. 108 వాహనం కోసం దాదాపు అరగంట పాటు వేచి చూశారు. ఆ వాహనం ఎంతకూ రాలేదు. ఇంతలో తీవ్ర అస్వస్థకు గురైన రవిశంకర్ శ్వాస అందక ఫుట్‌పాత్ పైనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతనిని వెంటనే దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు నిర్ధారించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates