నెల్లూరులో 5 సీట్ల‌ పై టీడీపీ క‌న్ను.. ఏం చేస్తున్నారంటే

నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేకుండా పోయింది. నెల్లూరు రూర‌ల్, వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌పై పార్టీ అధినేత వేటు వేయ‌డంతో వారు పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీకి చేర‌వ‌య్యారు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఎదురు లేద‌నే వాద‌న వినిపిస్తోంది. వీటితోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూటీడీపీ గెలవాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు.

వీటిలో ఆత్మ‌కూరు కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా ఉంది. అదేవిధంగా నెల్లూరు సిటీ కూడా .. చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ప‌క్కా అనేచ‌ర్చ తాజాగా నారాలోకేష్ కూడా నిర్ధారించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇక్క‌డ పాద‌యాత్ర ముగించుకునే స‌మ‌యంంలో స్థానిక నేత‌ల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. వ్య‌క్తిగతంగా చూసుకుంటే.. నెల్లూరు రూర‌ల్‌లో కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి బ‌లంగా ఉన్నారు.

అదేవిధంగా వెంక‌టగిరిలో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని ఆత్మ‌కూరుకు పంపించి.. గ‌తంలో వ‌రుస విజ‌యాలు అందుకున్న కురుగొండ్ల రామ‌కృష్ణ‌కు .. ఇక్క‌డ టికెట్ ఇవ్వ‌డం ద్వారా టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేశారు. అదేవిధంగా ఉద‌య‌గిరిలో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి బ‌లం బాగానే ఉంద‌ని.. ఆయ‌న గెలుపు త‌థ్య‌మ‌ని ఒక లెక్క గట్టారు. అలానే.. ఆత్మ‌కూరులో ఆనం గెలుపుపైనా టీడీపీ ధీమాగా ఉంది.

మ‌రో నియోజ‌క‌వ‌ర్గం, అత్యంత కీల‌క‌మైన నెల్లూరు సిటీని కూడా ఈ ద‌ఫా ద‌క్కించుకోవాల‌న్నది.. టీడీపీ వ్యూహం. ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయ‌న‌ను ఇక్క‌డ ఓడించ‌డం ద్వారా.. పార్టీని బ‌ల‌మైన స్థానంలో గెలిపించుకున్న‌ట్టు అవుతంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్న నేప‌థ్యంలో మాజీ మంత్రి పొంగూరి నారాయ‌ణ‌ను ప‌క్క‌న పెట్టి .. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి సోద‌రుడిని ఇక్క‌డ రంగంలోకి దింపాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. మొత్తంగా నెల్లూరులో 5 స్థానాల‌ను ద‌క్కించుకుని వైసీపీకి షాక్ ఇవ్వాల‌నేది టీడీపీ ప్రాథ‌మిక వ్యూహంగా ఉంద‌ని తెలుస్తోంది.