కమలానికి షాక్, విజయశాంతి కూడానా ?

బీజేపీని వదిలేసి తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే నేతల పేర్లలో విజయశాంతి పేరు కూడా ప్రచారమవుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినబడుతున్నాయి. ఒకపుడు విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నవారే. అయితే వివిధ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు గుర్తింపు దక్కటం లేదనే తీవ్ర అసంతృప్తి ఈమెను పట్టి పీడిస్తోంది. తన సేవలను ఉపయోగించుకోవాల్సిన పార్టీ ఏమాత్రం పట్టించుకోవటంలేదని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు.

అందుకనే తొందరలోనే కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో నిజం కూడా లేకపోలేదనే అనుకుంటున్నారు. ఎందుకంటే అందుకు విజయశాంతి వైఖరే కారణం. ఆమె ఐడెంటిటి క్రైసిస్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని కోరుకుంటారు. అయితే అందరు ప్రత్యేకంగా గుర్తించటానికి, గౌరవించటానికి తనకున్న కెపాసిటి ఏమిటి అనే విషయాన్ని మాత్రం ఆమె విశ్లేషించుకోవటంలేదు.

నిజానికి సినీ గ్లామర్ అన్న ఒక్క విషయాన్ని పక్కనపెట్టేస్తే విజయశాంతిలో మరే ప్రత్యేకతా లేదు. జనాలను ఆకర్షించేంత వాగ్దాటి కూడా లేదు. రాష్ట్రంలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కానీ వర్గంలో కానీ ఆమెకు పట్టులేదు. సినిమాల్లో అయితే ఆమె బాగానే రాణించారు. అదే విధమైన గుర్తింపు రాజకీయాల్లో కూడా రావాలంటే దొరకదని ఆమె మరచిపోయినట్లున్నారు. రాజకీయాల్లో ఆమెకు మించిన నేతలు చాలామందే ఉన్నారు.

ఎటువంటి ప్రత్యేకత, పట్టులేని విజయశాంతిని ఏ పార్టీ అయినా ఎందుకు అంతగా ప్రాధాన్యతిస్తుంది ? పైగా తల్లి తెలంగాణా అనే పార్టీ పెట్టారు. దుకాణం సరిగా నడవకపోవటంతో దాన్ని టీఆర్ఎస్ లో కలిపేశారు. అక్కడినుండి ఒకసారి ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవగానే అంత తన గొప్పతనమే అనుకున్నారు. దాంతో కేసీయార్ తో వ్యక్తిగతంగా చెడింది. అందుకనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మళ్ళీ బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి.