జగన్ అన్న బానం తెలంగాణ దాటి రాదు

చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మీడియాపై ఏడుపు ప్రారంభించిన‌ట్టుగా ఉంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వ్య‌వ‌హారం అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ నేత‌ల‌తో.. పైగా దివంగ‌త వైఎస్ కు ఆత్మ అనే పేరున్న కేవీపీ రామ‌చంద్ర‌రావు వంటివారితో ట‌చ్‌లో ఉంటూ.. రాహుల్‌గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పి.. ప‌దే ప‌దే క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్‌ను క‌లిసి.. ఆయ‌నతో మంత‌నాలు జ‌రిపిన ష‌ర్మిల వ్య‌వ‌హారం.. కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆమె త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై కాంగ్రెస్ నేత‌లు కూడా మౌనంగా ఉన్నారు. ఒక‌రిద్ద‌రు రియాక్ట్ అయినా.. మిశ్ర‌మ స్పంద‌న క‌నిపించింది. కానీ.. తాజాగా ఈ వార్త‌ల‌ను చాలా ఘాటుగా ఖండిస్తూ.. పెద్ద ట్వీట్ చేశారు ష‌ర్మిల‌. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. ‘‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా..తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి“ అని మీడియాపై మండిప‌డ్డారు.

అంతేకాదు.. “పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.. నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి.. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి.. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి.. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.. జై తెలంగాణ’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. స‌రే.. అంతా బాగానే ఉంది. కానీ. కాంగ్రెస్ నేత‌ల‌ను క‌ల‌వ‌డం వెనుక ఉన్న రీజ‌న్ కూడా ఆమె ఈ సంద‌ర్భంగా చెప్పేసి ఉంటే బాగుండేది క‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు.