రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉన్నాయి. ఉద్యోగుల పంపకాల్లో వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంబంధిత చెల్లింపులపైనా వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భూముల వివాదాలు తెరమీదికి వచ్చాయి. ఏపీలో భూముల ధరలు పడిపోయాయంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపాయి. తెలంగాణలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీలోని భూములపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎకరం అమ్మితే ఆ డబ్బుతో పొరుగున ఉన్న ఏపీలో వందెకరాలు కొనొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనేది దీని ద్వారానే తెలుస్తోందన్నారు. ఇటీవల తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనవచ్చునని ఇటీవల చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకూడదని కోరుకున్నారని తెలిపారు.
ఇప్పుడు ఆయనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, ఏపీ వెనుకబడుతోందని అంటున్నారని.. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఏపీలో కంటే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడో చెప్పిన మాటలను కేసీఆర్ కాపీ కొట్టి అవే మాటలను అనడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ మాటలు చెప్పడానికి సీనియర్ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.
అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం వచ్చి భుముల ధరలు తెలుసుకొని మాట్లాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గుడివాడ హితవు పలికారు. ఇక్కడ ఎకరా భూమి ధరకు తెలంగాణలో 150ఎకరాలు కొనొచ్చు అని.. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి అంటూ హితవుపలికారు. యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం మండలంలో గడపగడపకు వైసీపీ విజయోత్సవ సభలో మంత్రి అమర్‌నాథ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై తెలంగాణ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates