ఉద్యోగులపై మోడీ పెన్షన్ అస్త్రం?

పెన్షన్ విధానమన్నది ఉద్యోగుల విషయంలో పెద్ద వివాదమైపోతోంది. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటివరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను 2004లో రద్దుచేసింది. దానిస్ధానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సీపీఎస్ పద్దతిని చాలారాష్ట్రాల్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెన్షన్ విధానంపై జాతీయస్ధాయిలో ఒకే విధానం అమలు కావటంలేదు. ఓపీఎస్ రద్దు చేయటం, సీపీఎస్ ను తీసుకురావటం వరకే కేంద్రం నిర్ణయించింది. దేన్ని అమలుచేస్తారనే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.

ఓపీఎస్ విధానంలో కొంతకాలం తర్వాత ప్రభుత్వ ఖజనాపై విపరీతమైన ఆర్ధికభారం పడుతుందని కేంద్రం హెచ్చరించింది. దాంతో కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ ను రద్దుచేశాయి. కొన్ని రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. ఈ నేపధ్యంలోనే పెన్షన్ విధానంలో పై రెండు మార్గాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీపీఎస్(గ్యారెంటీ పెన్షన్ స్కీమ్) తెచ్చింది. దీన్నికూడా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ఇలాగుండగానే తాజాగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) విధానాన్ని తేబోతున్నట్లు సమాచారం.

కొత్త ఎన్పీఎస్ విధానంతో నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టాలని మోడీ ఆలోచిస్తున్నారట. అందుకనే 45 శాతం పెన్షన్ హామీకి కొత్త పద్దతిలో గ్యారెంటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఉద్యోగి చివరి జీతంలో ఇపుడు 38 శాతం పెన్షన్ గా వస్తోంది. దీన్ని 45 శాతానికి పెంచాలని మోడీ ఆలోచిస్తున్నారట. ఓపీఎస్ పద్దతిలో 50 శాతం పెన్షన్ రాకపోయినా సీపీఎస్ లో పెన్షన్ 38 కన్నా ఎక్కువే ఇవ్వాలని మోడీ ఆలోచించారట.

అందుకనే ఎన్పీఎస్ లో 45 శాతాన్ని పెన్షన్ గా ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ పద్దతిని గనుక అమల్లోకి తెస్తే కోట్లాదిమంది పెన్షనర్లకు ఆర్ధిక ప్రయోజనాలు కొంచెం పెరుగుతాయి. అయితే ఎన్పీఎస్ అన్నది పథకం వచ్చిన తర్వాత రిటైర్ అయ్యేవాళ్ళకి మాత్రమే వర్తించే అవకాశముంది. ఇప్పటికే సీపీఎస్ పద్దతిలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడదనే అంటున్నారు. మరి ఎన్పీఎస్ ను ఎప్పుడు ప్రకటిస్తారు ? ఎంతమంది ఈ పద్ధతిలో లబ్ధి పొందుతారనే విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. తొందరలోనే అంటే ఎన్నికల్లోగా మోడీ దీనిపై ప్రకటించే అవకాశముంది.