గ‌ద్ద‌ర్‌ను స‌స్పెండ్ చేసిన కేఏ పాల్ .. రీజ‌నేంటి?

ప్రజా గాయకుడు గద్దర్ పై పొలిటిక‌ల్ కామెడీ కింగ్‌గా నెటిజ‌న్లు పిలుచుకునే.. ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కే.ఏ. పాల్ తీవ్ర‌స్థా యిలో ఫైర‌య్యారు. గ‌ద్ద‌ర్ ఒక ద్రోహిలాంటి వ్య‌క్తి అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. ఆయ‌న‌ను తాను చాలా న‌మ్మాన ని, కానీ, ఆయ‌న త‌న‌కు న‌మ్మ‌క ద్రోహం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌ద్ద‌ర్‌ను నేను అన్న‌గా భావించా. కానీ, త‌మ్ముడికి ఆయ‌న ద్రోహం చేశాడు. ఇలాంటి నాయ‌కుడు నాకు అవ‌స‌ర‌మా? అని పాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. గ‌ద్ద‌ర్‌ను రాజ‌కీయాల‌కు ప‌నికిరాని నాయ‌కుడు అంటూ వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో త‌న ప్రజాశాంతి పార్టీ నుంచి గ‌ద్ద‌ర్‌ను సస్పెండ్ చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని పాల్‌ ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 5న తన పార్టీలో గద్దర్ చేరారని.. తాను మునుగోడులో ఎన్నికల ప్రచారానికి దిగుతున్నానని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో గద్దర్‌తో డీల్ కుదుర్చుకున్నారని.. అప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌చారానికి కూడా దూరంగా ఉండిపోయార‌ని.. పైగా కేసీఆర్‌పై నెపం వేశార‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య‌లో తాను ఓ సారి గద్దర్ ఇంటికి వెళితే.. ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని కేఏ పాల్ చెప్పారు.

అలాగే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరితే.. మూడు నెలలు ఆయనకు నరకం చూపించి, కిడ్నాప్ చేసి, ప్రజాశాంతి ఆఫీస్‌పై దాడులు చేశారని, పోలీసులు వచ్చినా ఆయనను కాపాడలేకపోయారని కేఏ పాల్ అన్నారు. ఎన్ని లక్షల మందిని అరెస్టు చేయగలరని ప్రశ్నించారు. 31 లక్షల మంది ప్ర‌జాశాంతి పార్టీలో చేరారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90 శాతం ఉన్నారని, 75 ఏళ్లుగా పాలిస్తున్న దొరలు ఒక శాతం, కమ్మవారు 3 శాతం, రెడ్లు 5 శాతం ఉన్నారన్నారు. 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లింలు అధికారాన్ని చేపట్టకూడదా? అని పాల్ ప్రశ్నించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌, ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాశాంతి పార్టీ పోటీ చేస్తుంద‌ని తెలిపారు.