ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆలోచించేంత సమయం చంద్రబాబునాయుడుకు లేదా ? పార్టీలో పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాజమండ్రి మహానాడు తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా దూకుడుపెంచారు. మహానాడులో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. మ్యానిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళేందుకని బస్సుయాత్ర మొదలు పెట్టించారు. ఐదురూట్లలో 125 నియోజకవర్గాల్లో ఏకధాటిగా 30 రోజుల పాటు బస్సు యాత్రలను డిజైన్ చేశారు. ఇదే సమయంలో జరిగిన సమీక్షలో రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లలోను పార్టీ గెలవాలని గట్టిగా హెచ్చరిచారు.
వీటికి అదనంగా అవసరమైన ప్రాంతాల్లో రెగ్యులర్ గా టూర్ చేస్తునే ఉన్నారు. ఇదంతా సరిపోదన్నట్లుగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఇప్పటికే ప్రకటించేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్దుల ప్రకటనకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే జనసేనతో పొత్తుల విషయంపై మాట్లాడే విషయాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఆరు రోజుల క్రితం పవన్ ప్రారంభించిన వారాహి యాత్రలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలను కవర్ చేశారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మామూలుగా అయితే పొత్తులపైన చర్చలు జరుపుకోవాలి. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తుకు అదనంగా బీజేపీ కూడా తోడయ్యే అవకాశాలున్నాయి. రెండు పార్టీల మధ్యే పొత్తుల అంశం చర్చకు రావటం లేదని అనుకుంటుంటే అదనంగా బీజేపీ కూడా తోడవుతోంది. అందుకనే చంద్రబాబు పొత్తు చర్చల్లో బిజీగా ఉండాలని తమ్ముళ్ళు కూడా అనుకున్నారు.
అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దాంతో జనసేనతో పొత్తు విషయాన్ని కూడా చంద్రబాబు పట్టించుకుంటున్నట్లు లేదన్న విషయం అర్ధమవుతోంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే 175కి 175 సీట్లలో టీడీపీని గెలిపించాలని జనాలను రిక్వెస్టులు చేస్తుండటమే. అంటే పొత్తులో జనసేన కలిసొస్తే వస్తుంది లేకపోతే ఒంటరిగానే పోటీచేద్దామనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే టీడీపీ ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే నమ్మకం తమ్ముళ్ళతో పాటు చంద్రబాబులో కూడా పెరిగిపోతోందట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.