ముఖ్యమంత్రి పదవి తర్వాత.. ముందు ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు చూద్దామని ఒకరు..
ముందు మీ పార్టీని 175 స్థానాల్లో పోటీ చేయించు.. తర్వాత సీఎం పదవి గురించి మాట్లాడు అని మరొకరు..
ఇలా తన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు వరుసుగా చేస్తున్న వేళ… జనసేన అధినేత ముఖ్యమంత్రి పదవి గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా చేపట్టిన వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన నిర్వహిస్తున్న సభల్లో ముఖ్యమంత్రి పదవిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ కలకలానికి దారి తీయటమే కాదు.. గతంలో పవన్ చెప్పిన మాటలకు.. తాజాగా చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధం లేదని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆసక్తిని పవన్ దాచుకోకుండానే.. బాహాటంగా తనకు ఆసక్తి ఉందన్న విషయాన్ని వెల్లడించారు.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు సీఎం పదవి విషయంలో ఉన్న స్పష్టత ఏమిటన్న విషయాన్ని తన మాటలతో చెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కావటానికి సరిపడా బలాన్ని ఇవ్వకుండా సీఎం అంటే ఎలా అని అభిమానుల్ని ప్రశ్నించి..కొద్దిరోజులకే ‘నేనే సీఎం’ అనేస్తున్నారు.. ఇదేం వైరుధ్యమన్న ప్రశ్నకు పవన్ స్పష్టత ఇచ్చారు. ‘సీఎం అని మావాళ్ల కోసం అన్నాను. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలి. దీనికి క్షేత్రస్థాయి పర్యటనలు.. సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలి. సీఎం.. సీఎం అని మావాళ్లు అదే పనిగా అరుస్తుంటే.. నా కేడర్ స్టేట్ మెంట్ ను ఆమోదించాను. సీఎం అని మా వాళ్లు అనుకుంటే సరిపోదు.. ప్రజలు అనుకోవాలి’ అంటూ పవన్ చెప్పిన మాటల్ని వింటే.. ఆయన గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్న విషయం స్పష్టమవుతుంది.
తన అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినదిస్తూ ఉంటే.. ‘‘నేను సిద్ధం’’ అన్న సంకేతాలు పంపినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే.. ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా? అంచెలంచెలుగా వస్తుందా? అన్నది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కులాల పరంగా విడిపోకుండా విచక్షణతో ఓటు వేయాలని.. ఓటు ఉందా? లేదా అని సరి చూసుకోవాలన్న ఆయన.. ఓటు వేసే వరకు ఓటుహక్కును జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.