ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని అన్ని కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేశారు. దీనిలో పేర్కొన్న మేరకు పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలను అందించడంలో ఎక్కడా వీసమెత్తు అవినీతికి కూడా తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు.
అయితే.. ఎంతగా జాగ్రత్త పడుతున్నామని సీఎం జగన్ చెప్పినా.. ఎక్కడో ఒకచోట మాత్రం తేడా కొడుతూ నే ఉంది. తాజాగా జగనన్న నవరత్నాలను దోచుకుంటూ నలుగురు ప్రభుత్వ అధికారులు పట్టుబడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికి ఇళ్ళు పధకంలో భారీ స్కామ్‌కు పాల్పడిన నలుగురు గృహనిర్మాణశాఖ అధికారులను ఉన్నతాధికారులు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నూజివీడు మండలం పల్లెర్లమూడి, మీర్జాపురం, దేవరగుంట గ్రామాల్లో జగనన్న ఇళ్ళను నిర్మించకుండానే బిల్లులు విడుదల చేశారు. నకిలీ లబ్ధిదారుల పేర్లను సృష్టించి గృహా నిర్మాణ సామాగ్రి సిమెంట్, స్టీల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి హౌసింగ్ అధికారులు సొమ్ములు చేసుకున్నారు. సుమారుగా రూ.2 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్మును కాజేసినట్టు సర్కారే గుర్తించింది.
అవినీతికి పాల్పడిన హౌసింగ్ డీఈని ట్రాన్స్‌ఫర్ చేసిన గృహా నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఏఈ, వర్క్ ఇన్స్‌పెక్టర్, గౌడౌన్ ఇంచార్జ్, విలేజ్ అసిస్టెంట్ ఇంజనీర్‌లను విధుల నుంచి తొలగించింది. అలాగే ఈ స్కాంపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణలో నూజివీడు నియోజకవర్గ పరిధిలో కొందరు పైస్థాయి అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం నవరత్నాల్లో దొంగలు పడ్డారనే వ్యవహారంపై సీఎం జగన్ చాలా సీరియస్ అయినట్టు తాడేపల్లి వర్గాలు పేర్కొన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates