వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విసిరిన సవాల్‌ను పవన్ స్వీకరించాలని సూచించారు. ఆయన ప్రకటన కోసం తాను ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. వారాహి యాత్రలో ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి విరుచుకుపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్ కాకినాడలో నా మీద పోటీ చేస్తాననే ప్రకటన చేయకుండా కాకినాడ నుంచి తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నారు. పోటీ గురించి ప్రకటన కోసం ఎదురు చూశాను. పోటీపై ప్రకటన చేయకుండా వెళ్తే నామీద చేసిన వ్యాఖ్యలు పవన్ వెనక్కి తీసుకున్నట్లుగా నేను భావిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ తనను తిట్టడానికి వారాహి యాత్ర మొదలుపెట్టారని మండిపడ్డారు.
ఎవరో ఏదో చెబితే నమ్మేసి నోటికొచ్చినట్టు తనపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని.. తగిన బుద్ధి చెబుతామని ద్వారంపూడి హెచ్చరించారు. అసలు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో జనసేన పార్టీ ఉందన్నారు. ‘‘కాకినాడలో నామీద పోటీ చేస్తాననే మీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాను’’ అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. కాకినాడలో జరిగిన వారాహి యాత్రలో ద్వారంపూడిని పవన్ ఘాటుగా హెచ్చరించారు.
‘‘ద్వారంపూడీ ఈసారి నిన్ను గెలవనివ్వను.. గుర్తుపెట్టుకో.. నీ పతనం మొదలైంది… నీ సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నాపేరు పవన్ కాదు’’ అంటూ జనసేనాని వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని శపథం చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇన్‌చార్జ్ పోస్ట్ తీసుకుంటానని ద్వారంపూడి తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates