40 మందిని కేసీయార్ టార్గెట్ చేశారా ?

తెలంగాణాలో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వేడి బాగా పెరిగిపోతోంది. ఆ వేడి ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ను తాకుతోంది. రాబోయే ఎన్నికల్లో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వకూడదని అనుకున్నారట. నియోజకవర్గాల్లో ఎవరి గ్రాఫ్ ఎలాగుందనే విషయమై కేసీయార్ ప్రతినెలా సర్వేలు చేయించుకుంటున్నారు. తనకందిన రిపోర్టుల ఆధారంగా సుమారు 40 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే వాళ్ళు కూడా బీజేపీ, కాంగ్రెస్ లోకి జంప్ చేసేట్లుగా మంతనాలు జరుపుతున్నారట.

ఇలా ఇతరపార్టీలతో మంతనాలు జరుపుతున్న వాళ్ళను కేసీయార్ టార్గెట్ చేసినట్లు సమాచారం. వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టించారట. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు ? ఎవరితో మంతనాలు జరుపుతున్నారు ? వాళ్ళ వ్యూహాలు ఎలాగ ఉండబోతున్నాయనే విషయాలను కేసీయార్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో తొందరలోనే అంటే జూలై లేదా ఆగస్టులో మొదటి విడత జాబితాను విడుదలచేయాలని కూడా డిసైడ్ అయ్యారట.

సుమారు 60-70 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. షెడ్యూల్ ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సుంది. అంటే ఎన్నికలకు మరో ఆరుమాసాలు మాత్రమే ఉంది. అభ్యర్దులను ఇప్పుడే ప్రకటించేస్తే జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవటానికి, అసంతృప్తులు ఎవరైనా ఉంటే సర్దుబాటు చేసుకునేందుకు తగిన సమయం ఉంటుందన్నది కేసీయార్ ఆలోచన. అయితే ఇదే సమయంలో టికెట్ దక్కని వాళ్ళు తిరుగబడే అవకాశముంది, ఇతర పార్టీల్లోకి జంప్ చేసే ప్రమాదం కూడా ఉంది.

ప్రతి అంశంలోను ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉంటుందని మరచిపోకూడదు. ప్లస్సుల సంగతని పక్కనపెట్టేస్తే మరి మైనస్సులను ఎలా మ్యానెజ్ చేసుకుంటారు అనే విషయమే అర్ధంకావటంలేదు. ఇప్పటికే కేసీయార్ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రజల వ్యతిరేకత నిజమే అనుకుంటే వాళ్ళకి పార్టీలోని అసమ్మతినేతలు, లేదా తిరుగుబాటు నేతలు కూడా తోడైతే అభ్యర్ధుల గెలుపు ఎలాగ అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది. మరి కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.