జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాలపై యువతకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలు వద్దంటే.. వాటికి దూరంగా ఉంటే.. వ్యక్తిగతంగా మీకు.. మీతోపాటు సమాజానికి కూడా చేటు చేసినట్టేనని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు మాకొద్దనే ఆలోచన సమాజానికి చేటని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుళ్లు రాజకీయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తల పవన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ వంటి పార్టీల వల్లే రాజకీయాలపై వ్యతిరేకత పెరుగుతోందని, బాధ్యతలేని పాలకుల వల్ల వ్యవస్థ గాడి తప్పుతోందని పవన్‌కల్యాణ్ దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తుకు యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, కులాల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా రాజకీయ మార్పునకు దశాబ్ధకాలంగా ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పవన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో జనసేనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు మేలు జరిగేలా పాలన అందిస్తామని పవన్ వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తామని పవన్ చెప్పారు. యువత ఉద్యోగాల కల్పనకు రూ.10లక్షల పెట్టుబడి సాయం ఇచ్చి వేలాది ఉద్యోగావకాశాలు కల్పిస్తాననని అన్నారు. ఈ సందర్భంగా మేధావులు చెప్పిన సూచనలను పవన్ నమోదు చేసుకున్నారు. అదేసమయంలో యువత ఉద్యోగనోటిఫికేషన్లు, ఉపాధి కల్పనకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పవన్‌ను కోరారు. వాటికి పవన్ అంగీకరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని ఆయన సూచించారు.