కేటీఆర్‌ పై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు !

కాంగ్రెస్ నేత, బీఆర్ఎస్ మాజీ నాయ‌కుడు కొండా మురళి, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌తో మొదలైన విమర్శలు పర్వంతాజాగా ప‌తాక స్థాయికి చేరింది. “కేటీఆర్ ఆడాకాదు.. మ‌గా కాదు.. తేడా” అంటూ.. కొండా ముర‌ళి నిప్పులు చెరిగారు. అంతేకాదు.. “నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా.. నన్ను రౌడీ అంటున్నావు.. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది. శ్రీకృష్ణదేవరాయులు వంశంలో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు ఆడది కాదాయే.. మొగోడివి కాదాయె.. మీసాలు లేక ఎవరో తెలియకపాయె.. మీసాలుంటే మెలేస్తే బుద్ధివంతుడివి, ధైర్యవంతుడివి అనుకునేవాళ్లం’ అని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా మురళి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడని కొండా ముర‌ళి తెలిపారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకున్నాడు కాబట్టే లిక్క‌ర్ స్కాంలో కవిత అరెస్ట్ కాలేదని దుయ్య‌బ‌ట్టారు. ‘‘నాకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్రెడ్డిని కలిసి పరకాల టికెట్ అడుగుతా. అధిష్టానం ఒప్పుకుంటే పరకాలలో నేనే నిలబడతా. కొండా సురేఖని వరంగల్లో గెలిపిస్తా.. నేను పరకాలలో గెలుస్తా. నంది పైపులు అమ్ముకునే ధర్మారెడ్డి.. నన్ను బ్రతిమాలి పెద్ద కాంట్రాక్టు తీసుకున్నాడు’’ అని కొండా మురళి వ్యాఖ్యానించారు.

ద‌మ్ముంటే రా! : ధ‌ర్మారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. కొండా మురళీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నీకు దమ్ముంటే..రా! వచ్చి పరకాలలో పోటీ చేసి గెలువు. కొండా మురళీ మీ భాష మార్చుకోండి. సురేఖ.. ఓ మహిళ‌ అని మరిచి మాట్లాడుతున్నారు. వారి కుమార్తె కూడా వయసుకు మించి మాట్లాడుతున్నారు. మగతనం అంటే ఎలా తెలుస్తుంది?, నువ్వు రోడ్డు మీద కుక్కవు.. అందుకే కుక్కలా మొరుగుతున్నవ్!, అభివృద్ధిలో నీ పాత్ర ఏంటో చెప్పు. కృష్ణ దేవరాయల కాలి గోటితో సరిపోవు నువ్వు. నువ్వు మర్డర్లు చేసింది నిజం కాదా?’’ అని ధర్మారెడ్డి నిప్పులు చెరిగారు.

అంతేకాదు.. ‘అసలు నువ్వు ఏం చేసి డబ్బులు సంపాదించావ్!, ఎన్ని కోట్లు పన్నులు కట్టావు చెప్పు. పరకాలలో నువ్వు గెలవలేవనే వరంగల్ వెళ్లింది నిజం కాదా? నీకు రాజకీయ పునర్జన్మ నిచ్చింది కేసీఆర్. నీ బ్రతుకేంటో మీ మేనకోడలు బయట పెట్టింది. సొంత గ్రామస్తుల భూములు లాక్కుని అమ్ముకున్నది వాస్తవం కాదా?, కేటీఆర్, కేసీఆర్ మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా కార్యకర్తలే ఉరికించి కొడతారు.’’ అంటూ కొండా మురళీకి ధర్మారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మ‌రి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.