నేను తెలంగాణ కోడలిని అంటూ.. వైఎస్సార్‌తెలంగాణ పార్టీ పెట్టి.. పాదయాత్ర కూడా చేసిన దివంగత వైఎ స్ తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వైఎస్సార్ టీపీ తరఫున పాదయాత్రలు చేయడంతో పాటు ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శ లు కూడా గుప్పించారు. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో కేసులు కూడా ఎదుర్కొన్నారు.
ఇక, ఇటీవల గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులపై విరుచుకుపడడం, చేయి చేసుకోవడం కూడా తెలిసిందే. ఇక, ఇప్పుడు అనూహ్యంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రెడీ అయినట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఒంటరిపోరుతో అధికారంలోకి రావాలని అనుకుంటున్నప్పటికీ.. రాజకీయంగా ఇప్పటి వరకు షర్మిలకు కలిసి రాలేదనే చెప్పాలి.
ఎవరూ కూడా కీలక నాయకులు ఆమె చెంతకు చేరలేదు. ఆమె పార్టీ జెండా కూడా మోయలేదు. ఇంతలో నే.. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్, దివంగత వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావులు.. ఎంట్రీ ఇచ్చి.. షర్మిల పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేదిశగా ఒప్పించారని తెలుస్తోంది. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే రెండు ప్రధాన డిమాండ్లకు కాంగ్రెస్ అదిష్టానం కూడా అంగీకరించినట్టు సమాచారం. ఒకటి పాలేరు(ఉమ్మడి ఖమ్మం జిల్లా) నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసేందుకు, అదేవిధంగా తన వర్గంలోని వారికి 10 సీట్లు కేటాయించడంతోపాటు ప్రభుత్వం ఏర్పడితే.. తనకు డిప్యూటీ సీఎం పోస్టును ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ నేతల్లోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.