ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభల కు జనాలు పోటెత్తుతున్నారు. మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవ ర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సమావేశాలకు… జనాలు పోటెత్తారు. ఎటు చూసినా.. జనమే అనే మాట స్పష్టంగా కనిపించింది. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర నెల్లూరులో సాగుతోంది.
ఈ యువగళం పాదయాత్రకు కూడా ప్రజలు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఎటు చూసినా.. కిక్కిరిసి పోతున్నారు. యువగళం పాదయాత్రకు ఇప్పటి వరకు వచ్చిన స్పందన కంటే.. ఎక్కువగా నెల్లూరులో కనిపించిందనేది వాస్తవం. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కూడా భారీ ఎత్తున సక్సెస్ అవుతోంది. పిఠాపురంలో తాజాగా నిర్వహించిన వారాహియాత్రకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు.
ఇలా.. ముగ్గురు నాయకులు చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలకు ఎక్కడి నుంచి వస్తున్నారో.. ఎలా వస్తున్నారో.. తెలియదు కానీ.. ప్రజలు మాత్రం భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి వీరిలో ఎంత మంది టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. సాధారణంగా.. నాయకుల సభలకు వచ్చేవారంతా ఓటేస్తారనే నమ్మకం లేదు. గతంలో కుప్పం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా భారీ ఎత్తున ప్రజలు వచ్చారు.
కానీ, ఆ నియోజవర్గంలో చంద్రబాబే మరోసారి విజయం దక్కించుకున్నారు. ఇలానే.. ఇప్పుడు వీరు నిర్వహిస్తున్నసభలు, సమావేశాలకు కూడా.. ప్రజలు వచ్చినా.. ఓట్లు పడతాయా? పడవా? అనేది ఆసక్తిగా మారింది. నెల్లూరును తీసుకుంటే.. యువగళం ఓ రేంజ్‌లో సాగుతోంది. కానీ, బలమైన రెడ్డి సామాజిక వర్గం వైసీపీని వదిలేసి టీడీపీవైపు మొగ్గుతుందా? అనేది చూడాలి. అదేవిధంగా జనసేన అధినేత పై విశ్వాసం పెరుగుతుందా ? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates