ఏపీలో ఇంత గందరగోళమా ?

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోయింది. రాబోయేఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది ? ఎన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయో జనాలకు అర్ధంకావటంలేదు. జనాలకు అర్ధంకాకపోతే పోయింది కనీసం పార్టీల్లో అయినా క్లారిటి ఉందా అనే అనుమానం పెరిగిపోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ తర్వాత అయోమయం మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత గందరగోళం మరింత పెరిగిపోయింది.

ఇంతకాలం టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవటానికి రెడీ అయిపోయాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి అయోమయంలేదు. వస్తే బీజేపీ కూడా కలుస్తుంది లేకపోతే లేదన్న క్లారిటి ఉండేది. అయితే సడెన్ గా అమిత్ తో చంద్రబాబు భేటీ జరగటంతో పొత్తుల విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. టీడీపీ, బీజేపీ పొత్తుకు రెడీ అవుతున్నాయనే ప్రచారం పెరిగిపోయింది. అయితే రెండుపార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఇటు చంద్రబాబు అటు బీజేపీ నేతలు ఎవరూ ప్రకటించలేదు. దాంతో ఇద్దరు ఎందుకు కలిసారో అర్ధంకాలేదు.

ఇదే సమయంలో పవన్ కల్యాన్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. యాత్రలో భాగంగా తాను ఒంటరిగా పోటీచేస్తానో లేకపోతే సమూహంగా పోటీచేస్తానో ఇంకా తేల్చుకోలేదన్నారు. ఇంతకాలం టీడీపీతో పొత్తుంటుందని చెప్పిన పవన్ సడెన్ గా ఎందుకు మాటమార్చారో అర్ధంకావటంలేదు. ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు తనకు బీజేపీ నుండి సహకారం అందదన్నారు. వైసీపీ-బీజేపీ మధ్య ఎప్పుడూ సహకారం లేదు. ఉన్నదల్లా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత మాత్రమే. అయినా బీజేపీ నుండి సహకారం అందదన్న మాటను జగన్ చెప్పాల్సిన అవసరంలేదు.

ఇక పొత్తుల విషయాన్ని బీజేపీ నేతల దగ్గర ప్రస్తావిస్తే తమకు జనసేనతో మాత్రమే పొత్తుంటుందని చెబుతున్నారు. సో ఇప్పటికి వైసీపీ మాత్రమే ఒంటరిగా పోటీచేస్తుందని క్లారిటి ఉంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీలు ఏమిచేయబోతున్నాయో అర్ధంకావటంలేదు. అసలీ పార్టీలు ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నాయో కూడా తెలీటంలేదు.