బండి చెప్పింది నిజమేనా ?

బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటన నిజమేనా అనే చర్చ మొదలైంది. ఇంతకీ బండి చెప్పింది ఏమిటంటే బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎంఎల్ఏలు తమతో రెగ్యులర్ టచ్ లో ఉన్నారట. వాళ్ళంతా బీజేపీలో చేరటానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆ సమయం కూడా చాలా తొందరలోనే వచ్చే అవకాశముందన్నారు. ఇక్కడే బండి చెప్పిన మాటలపై చర్చలు పెరిగిపోతున్నాయి. నిజంగానే బండి చెప్పినట్లుగా బీఆర్ఎస్ నుండి 25 మంది ఎంఎల్ఏలు టచ్ లో ఉంటే వాళ్ళని చేర్చుకునేందుకు ఇంకా ఆలస్య మెందుకు ?

బండి చెప్పినట్లుగా వాళ్ళంతా బీఆర్ఎస్ లో పోటీకి మళ్ళీ టికెట్లు దక్కుతుందా దక్కదా అని ఎదురు చూస్తున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ కేసీయార్ వాళ్ళకి టికెట్లిస్తే అప్పుడు బీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతారు. దక్కకపోతే మాత్రమే బీజేపీలోకి దూకేందుకు రెడీ అవుతారని అర్ధమవుతోంది. అప్పుడు కూడా బీజేపీలోకి దూకుతారని గ్యారెంటీలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బాగా పుంజుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో హస్తంపార్టీ నేతల్లో మంచి జోష్ కనబడుతోంది.

ఇదే విషయాన్ని బండి మాట్లాడుతు కొట్టిపడేశారు. అసలు కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కవని తేల్చేశారు. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కాంరెస్ అధికారంలోకి ఎలాగ వస్తుందని బండి ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండు డివిజన్లు మాత్రమే అని బండి గుర్తుచేశారు. అధికారపార్టీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్నాయమో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ స్పాన్సర్డ్ పార్టీగా అందరికీ తెలుసన్నారు.

కేసీయార్ తో పాటు కుటుంబసభ్యులు కూడా జైలుకు వెళ్ళటం తథ్యమన్నారు. పార్టీలతో సంబంధంలేకుండా ఎవరు అవినీతికి పాల్పడినా అలాంటి వాళ్ళందరు జైలుకు వెళ్ళాల్సిందే అని బండి కచ్చితంగా చెప్పారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండుపార్టీలు దెబ్బతినటం తప్పదని జోస్యం కూడా చెప్పారు.