అన్నవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే, జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రలో భాగంగా ఈ రోజు పిఠాపురంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను పవన్ స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తనను దూషించడంపై పవన్ స్పందించారు. వైసీపీ నేతల దూషణలను తాను ఆహ్వానిస్తున్నానని పవన్ అన్నారు. అయితే, తాను సీరియస్ రాజకీయాలు చేసేందుకు వచ్చానని, వైసీపీ నేతలు చేసే అల్పమైన విమర్శలను పట్టించుకోబోనని పవన్ అన్నారు. తాను చేతల మనిషిని అని, మాటలతో కాకుండా చేతలతోనే అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ అన్నారు.
రాబోయే కాలంలో వైసీపీ నేతల ప్రతి మాటకు మార్పుతోనే సమాధానం చెబుతానని పవన్ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ వెల్లడించారు. ఈ రోజు జనవాణి కార్యక్రమం సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని, లేకపోతే అరాచక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతూనే ఉంటాయని పవన్ అన్నారు.
జనవాణి కార్యక్రమంతో భవిష్యత్తులో ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పు కోసమే వారాహి యాత్ర చేపట్టానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా జనసేనను స్థాపించానని, కులాలు, ప్రాంతాలవారీగా విడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన వారాహి విజయ యాత్రకు ప్రజల ఆశీస్సులు, మద్దతు కావాలని కోెరారు. రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపించేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు పవన్ విజ్ఞప్తి చేశారు.