వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సత్యనారాయణ భార్య జ్యోతితో పాటు ఆయన కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ జీవీల కిడ్నాప్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆ కిడ్నాప్ వెనుక రాజకీయ కోణం ఉందన్న రీతిలో పుకార్లు వచ్చాయి. కానీ, ఈ కిడ్నాప్ జరిగిన కొద్ది గంటలలోపే పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులను సురక్షితంగా రెస్క్యూ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ మొత్తం కిడ్నాప్ ఎపిసోడ్ పై వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిడ్నాప్ కు సంబంధించిన పలు వివరాలను ఆయన వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే సత్యనారాయణ భార్య కుమారుడు కిడ్నాప్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 13న శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత శరత్ తల్లిని కూడా బెదిరించి బంగారం, నగదు తీసుకున్నారని వెల్లడించారు. ఆడిటర్ జీవీ దగ్గర సత్యన్నారాయణ ఆస్తిపాస్తులకు, నగదుకు సంబంధించిన వివరాలు ఉంటాయని ఆయనను కూడా కిడ్నాప్ చేసినట్టుగా త్రివితక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు.
శరత్ చంద్ర, జీవీల ఖాతాలలో కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని అన్నారు. ఆ ముగ్గురిని వారి కారులోనే ఎక్కించుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే, తాను ఫోన్ చేసినా ఆడిటర్ జీవీ స్పందించడం లేదని సత్యనారాయణ చేసిన కంప్లైంట్ తో పోలీసులు రంగంలోకి దిగారని వివరించారు. ఈ కిడ్నాప్ వెనుక మొత్తం 7గురు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని, ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు.
ఎంపీ నివాసంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసు బృందాలు అప్రమత్తమై జీవీకి ఫోన్ చేసి ట్రేస్ చేయడం మొదలుపెట్టాయని వెల్లడించారు. అయితే, జీవీ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారని, కానీ, ఆయన చెప్పిన వివరాలకు వాస్తవాలకు పంపడం లేకపోవడంతో అనుమానం వచ్చిందని అన్నారు. జీవీ సెల్ సిగ్నల్ ఆధారంగా వారు విజయనగరం వైపు వెళ్తున్నారని గుర్తించి ఛేజ్ చేసి వారిని పట్టుకున్నామని అన్నారు. హేమంత్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. ఈ కిడ్నాపర్లలో ఒకరు సత్యనారాయణ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా గతంలో పని చేశారని, డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారని గుర్తించామని అన్నారు. హేమంత్ పై హత్య కేసుతో పాటు 12 కేసులున్నాయని వెల్లడించారు.