అన్నయ్యను అవమానించడంపై పవన్ ఫైర్

కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా జగన్ దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లడం, చేతులు కట్టుకొని వినమ్రంగా మాట్లాడిన ఘటనపై పవన్ తాజాగా స్పందించారు. చాలామంది అభిమానించే వ్యక్తిని చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేసి పైశాచిక ఆనందం పొందిన జగన్ అంటూ విరుచుకుపడ్డారు.

జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడని,  పవర్ ఫుల్… పవర్ లెస్… ఈ రెండు రకాల కులాలే ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచఖ్యాతి గడించిన వ్యక్తులైనా…జగన్ దగ్గర అయ్యా దొరా అంటూ చేతులు కట్టుకుని నిలుచోవాలని ఎద్దేవా చేశారు. ఇది ఫ్యూడలిజం అని, ఇలాంటి పోకడలకు తాను వ్యతిరేకం అని అన్నారు. సొంత చిన్నాన్న చనిపోతే గుండెపోటు అన్నారని, అన్ని దారులు ఈ ముఖ్యమంత్రి ఇంటివైపే చూపిస్తున్నాయని, ఇక్కడ ఎవరు పాపం పసివాడు అంటూ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తండ్రి చనిపోతే కోర్టులో వాదించడానికి వైఎస్ సునీతకు న్యాయవాది కూడా లేరని, సొంతంగా వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబం తప్పు చేస్తే తట్టుకోగలమని, కానీ ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో ఆయన నమూనాలు కనిపిస్తే మాత్రం ఎదురుతిరగక తప్పదని అన్నారు. తనను గాజువాకలో గెలిపించి ఉంటే రుషికొండ తవ్వకాలు, భూకబ్జాలు ఆపి ఉండేవాడినని అన్నారు.