రెచ్చిపోయిన ప్రియాంక

Priyanka Gandhi
Priyanka Gandhi

మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం కాంగ్రెస్ నేతలకు మంచి టానిక్ లాగ పనిచేస్తోంది. అదేఊపుతో ఈ ఏడాదిలో జరగబోయే నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణా, రాజస్ధాన్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్లో ప్రియాంక బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రియాంకను చూడటానికి జనాలు కూడా విరగబడ్డారు. ముఖ్యంగా మహిళలు, యూత్ ప్రియాంకతో బాగా కనెక్టయినట్లు కనిపిస్తోంది.

తన ప్రసంగంలో ఎక్కువగా స్ధానిక సమస్యలనే ప్రస్తావించారు. అలాగే డైరెక్టుగా నరేంద్రమోడీ పాలనా వైఫల్యాలపైన కూడా ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. కర్నాటకలో గెలుపుకు కారణమైన హామీలనే మధ్యప్రదేశ్ లో కూడా ప్రియాంక ప్రస్తావించారు. పనిలోపనిగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైఫల్యాలను పదేపదే ఎత్తిచూపారు. మోడీ తరచు చెప్పే డబుల్ ఇంజన్ ప్రభుత్వంలోని లోపాలను ప్రియాంక డైరెక్టుగా ఎత్తిచూపారు.

హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ను జనాలు ఏ విధంగా తిరస్కరించారనే విషయాన్ని ఉదాహరణలతో సహా వివరించారు. కాబట్టి మధ్యప్రదేశ్ లో కూడా జనాలు వివేకంతో కాంగ్రెస్ కు ఓట్లేసి డబుల్ ఇంజన్ సర్కార్ కు చెక్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం జనాలకు ఏ విధంగా నష్టంచేస్తోందనే విషయాన్ని ప్రియాంక వివరించారు. మొత్తంమీద నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రియాంక ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారనే చెప్పాలి.

ఒకప్పుడు అంటే ఏడాది క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రియాంక ఇఫుడున్నంత చురుగ్గా లేరు. ఏదో మొక్కుబడిగా ప్రచారం చేసి వెళ్ళిపోయేవారు. ఆ ప్రచారంలో కూడా చాలా తక్కువ నియోజకవర్గాలకే పరిమితమయ్యేవారు. మాటల్లో కూడా పెద్దగా పదునుండేది కాదు. కానీ ఏడాదినుండి ప్రియాంక బాడీ ల్యాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ప్రచారం, ర్యాలీలు, రోడ్డుషోల్లో బాగా ఇన్వాల్వవుతున్నారు. ఎక్కడ పర్యటించినా ప్రధానంగా స్ధానిక సమస్యలపైనే దృష్టిపెడుతున్నారు. మారిన ప్రియాంక స్టైల్ కాంగ్రెస్ పార్టీకి బాగా లాభం చేస్తున్నట్లే ఉంది.