అమిత్ షాను అనే ధైర్యం ఉందా?

నాలుగేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ పేరుకే వైరి ప‌క్షాలు కానీ.. తెర వెనుక ఈ రెండు పార్టీలు ఒక‌దానికి ఒక‌టి స‌హ‌కారం అందించుకుంటున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం. బీజేపీని వైసీపీ వాళ్లు ఎప్పుడూ గ‌ట్టిగా విమ‌ర్శించరు. అలాగే కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కారుకు ఎప్పుడు ఏ మ‌ద్ద‌తు కావాల‌న్నా అందిస్తారు.

అలాగే బీజేపీ కూడా జ‌గ‌న్ అండ్ కోకు ప‌రోక్షంగా త‌మ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న విష‌యం అనేక అంశాల్లో స్ప‌ష్టంగా వెల్ల‌డైంది. ఐతే రెండు పార్టీల‌కు సంబంధాలు చెడాయా.. లేక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండ‌గా జ‌నాల‌కు భ్ర‌మ‌లు క‌ల్పించాల‌ని చేస్తున్నారా అన్న‌ది తెలియ‌దు కానీ.. ఈ రెండు పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం ఘాటుగా విమ‌ర్శించుకుంటున్నారు. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వైసీపీని టార్గెట్ చేయ‌గా.. పేర్ని నాని, కొడాలి నాని ఆయ‌న‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

ఇంత‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న ప్ర‌భుత్వం మీద తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. రైతుల ఆత్మ హత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని.. జగన్ మోహన్ రెడ్డి నువ్వు సిగ్గు పడాలి ఈ విషయంలో అని ఆయ‌న అన్నారు. అంతే కాక గంజాయి అక్ర‌మ ర‌వాణాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర స్థానంలో ఉంద‌ని.. ఎక్క‌డ గంజాయి ప‌ట్టుబ‌డినా మూలాలు ఏపీలోనే క‌న‌బ‌డుతున్నాయ‌ని అన్నారు. జగన్ పాలనలో అవినీతి తప్ప ఏం లేదని.. మోడీ ఇచ్చే పధకాల పేరు మార్చి జగన్ నేనే ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నాడ‌ని.. మోడీ ఇచ్చే బియ్యం పైన కూడా జగన్ తన బొమ్మ వేసుకుంటున్నాడ‌ని అమిత్ షా విమ‌ర్శించారు. ఇంకా జ‌గ‌న్, ఆయ‌న ప్ర‌భుత్వం మీద ప‌లు ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు అమిత్ షా.

మ‌రి న‌డ్డా విష‌యంలో స్పందించిన‌ట్లే వైసీపీ నేత‌లు కేంద్ర హోం మంత్రి వ్యాఖ్య‌ల‌పైనా స్పందిస్తారా అన్న‌ది చూడాలి. న‌డ్డా పార్టీ అధ్య‌క్షుడు కావ‌చ్చు కానీ.. పార్టీలో ఆయ‌న ఏమంత ప‌వ‌ర్ ఫుల్ కాద‌ని అంద‌రికీ తెలుసు. కానీ అమిత్ షా అలా కాదు. మోడీ త‌ర్వాత‌.. ఇంకా చెప్పాలంటే మోడీ స‌మాన స్థాయి ఆయ‌న‌ది. ఆయ‌న‌తో పెట్టుకుంటే ఏమ‌వుతుందో అంద‌రికీ తెలుసు. మ‌రి షా విమ‌ర్శ‌ల‌పై వైసీపీ నేత‌ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.