కేసీయార్ ను దూరంపెట్టేశారా ? నమ్మటంలేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాల అధినేతలంతా సమావేశమవుతున్నారు. ఒక విధంగా జరగబోయే సమావేశం చాలా చాలా కీలక సమావేశమనే చెప్పాలి. బీహార్ రాజధాని పాట్నాలో జరగబోతున్న సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవ చూపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధితో పాటు ఎన్సీపీ ఛీప్ శరద్ పవార్, బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు హాజరవుతామని చెప్పారు.

హాజరయ్యే వాళ్ళను చూస్తేనే తెలుస్తోంది జరగబోయే సమావేశం ఇంతటి ముఖ్యమైనదో. అలాంటి సమావేశానికి తెలంగాణ సీఎం కేసీయార్ ను దూరం పెట్టేశారు. సమావేశానికి కేసీయార్ ను పిలవటం లేదని స్వయంగా నితీషే చెప్పారు. నిజానికి తెలంగాణా స్టేట్ కూడా ప్రతిపక్షాలకు చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. కేసీయార్ నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ కూటమి ఏర్పాటుకు ఒకపుడు ప్రయత్నించిన వాళ్ళే. కాకపోతే మారిన పరిస్ధితుల్లో చాలాపార్టీలు కాంగ్రెస్ చే కలిసి పనిచేయటానికి రెడీ అయిపోయాయి.

జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండ ఉండాల్సిందే అన్న విషయాన్ని కేసీయార్ మరచిపోయారు. ఎంతసేపు కాంగ్రెస్ అవసరంలేకుండానే బీజేపీని దెబ్బకొడదామని చెబుతారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీలకు తాను సారధ్యం వహిద్దామని కేసీయార్ చాలా పెద్ద ప్లాన్ వేశారు. అయితే కేసీయార్ వ్యక్తిత్వాన్ని గమనించిన తర్వాత ఎంతమాత్రం నమ్మదగ్గ నేతకాదని అందరికీ అర్ధమైపోయింది.

ఏరోజు ఎలాగుంటారో ఏ పార్టీతో చేతులు కలుపుతారో ఎవరిని వదిలేస్తారో ఎవరు ఊహించలేరు. ఇలాంటి చంచల స్వభావం ఉన్న నేతను నమ్ముకుంటే కష్టమని ప్రతిపక్షాల నేతలు అనుకున్నట్లున్నారు. దాదాపు ఇలాంటి మనస్తత్వం ఉన్న నేతే మమతా బెనర్జీ కూడా. అందుకనే మమతతోనే వేగలేకపోతున్న ప్రతిపక్షాలు కేసీయార్ తో వేగటం కష్టమని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్తిగా కేసీయార్ ను వదిలేశారు. మరి జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని అనుకుంటున్న కేసీయార్ నమ్మకమైన మిత్రులు లేకుండా చక్రం ఎలా తిప్పగలరు ?