వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. పార్టీ టికెట్ ఆశిస్తున్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. తాను పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు.
ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లోకేష్‌తో చర్చించారు. మేకపాటితో పాటు బద్వేల్‌కు చెందిన టీడీపీ నేతలు కూడా లోకేష్‌ను కలిశారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. “నారా లోకేష్‌ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించా. పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథంలో ఆయన్ని ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చాను. నా నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేస్తాం” అని అన్నారు.
జగన్‌మోహన్ రెడ్డిని టికెట్ కోసం ఐదు సార్లు కలిసినా లాభం లేదు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వస్తున్నాను. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతాను. నాతోపాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తా. ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తా. ఉదయగిరి నియోజకవర్గంలో నేను, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి లోకేష్ పాదయాత్రను ఆహ్వానిస్తామని మేకపాటి పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates