వైసీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలోకి చేరిక‌..

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఈ నెల‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఆయ‌న దాదాపు గంట పాటు చ‌ర్చించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబుతో భేటీ అనంతరం నెల్లూరుకు చేరుకున్న ఆనం ఆ వెంట‌నే టీడీపీ స్థానిక నాయ‌కుల‌తో సమావేశమయ్యారు. ఈ స‌మావేశానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు, హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్ర‌మంలోనే ఆనం టీడీపీలో అధికారికంగా చేరిక‌పైనా చ‌ర్చించారు. నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో మొదలు కాబోతున్న నేప‌థ్యంలో ఈ పాద‌యాత్ర స‌య‌మంలోనే ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయ‌డంతోపాటు.. పాదయాత్ర నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీని బలోపేతం చేసి, జిల్లాలో పాదయాత్ర పూర్తికాగానే టీడీపీ సభ్యత్వం తీసుకునేందుకు రెడీ అయ్యారు. నేతలంతా ఆనంతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్ల‌డం కూడా స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆనంతో సమావేశం అయ్యారు. ఈ క్ర‌మంలో భాగంగా వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులను ఆనం టీడీపీలో చేర్చేందుకు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, నెల్లూరులో వ‌డివ‌డిగా మారుతున్న వైసీపీ ప‌రిణామాలు.. సీఎం జ‌గ‌న్‌కు సెగ పెట్ట‌డం ఖాయ‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.