కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మధ్య మాల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఈ క్రమంలో అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. మరో వైపు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
తాజాగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించే అయోధ్యలో రామమందిరం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ప్రవచించే రామరాజ్యానికి జై కొడుతూనే….తమదైన షరతులు పెట్టారు.
సోషల్ మీడియాలో ప్రజలతో అనుసంధానం అవడంలో క్రియాశీలంగా వ్యవహరించే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ ద్వారా, ఆస్క్ కేటీఆర్ పేరుతో కనెక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల,మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలి అని తన ఆకాంక్షను మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. తద్వారా బీజేపీ మద్దతు ఇచ్చే సిద్ధాంతానికి పూర్తి మద్దతు ఇ్వవకుండా… అన్ని వర్గాల కోణంలో దానికి సంఘీభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మక పథకమైన ఆయుష్మాన్ భారత్ గురించి సైతం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.