చంద్ర‌బాబు సీఎం కాదు.. ఇప్పుడు ఇంత ఖ‌ర్చు ఎందుకు?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌స్తుతం ఎన్ఎస్జీ భ‌ద్ర‌త ఉంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేలా ఇటీవ‌ల కేంద్రం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో ఇటీవ‌ల రాష్ట్ర పోలీసులు చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌లో రాళ్లు విసురుతున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికి నాలుగు ప్రాంతా ల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు కురిశాయి.

ఇదంతా వ్యూహాత్మ‌కంగా చేసిందేన‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. తాజాగా వీరి విమ‌ర్శ‌ల కు ద‌న్నుగా నిలిచే వ్యాఖ్య‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబుకి గతంలో బెదిరింపులు ఉన్నాయి. ఎప్పుడో నా చిన్న‌ప్పుడు(వ్యంగ్యంగా) ఆయ‌న‌పై క్లెమోర్ ప్రయోగించార‌ని విన్నాను. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న సీఎం కాదు. ఇంత ఖ‌ర్చు ఎందుకు? ఆయ‌న‌కు భద్రతను నేటికీ కొనసాగించడం సబబు కాదు. ఈ మాట ప్ర‌జ‌లు కూడా అంటున్నారు” అని వ్యాఖ్యానించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వారు కూడా చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామా లు.. వంటివి గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు భ‌ద్ర‌త విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏదో వ్యూహం ప‌న్నింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో వీర‌భ‌ద్ర‌స్వామి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల స్పీక‌ర్‌ తమ్మినేని సీతారాం కూడా.. ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర ప్రజల్లో చాలా మంది చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారంటూ.. త‌మ్మినేని వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికల వేళ చంద్రబాబుకి భద్రత తొలిగించేందుకు వైసీపీ ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న టీడీపీ నేత‌లు.. ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తే.. తాము చూస్తూ ఊరుకోబోమ‌ని.. ఏం చేయాలో త‌మ‌కు తెలుసున‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.