ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. స్కామ్ లో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారటాన్ని వ్యతిరేకిస్తు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. శరత్ ను అప్రూవర్ గా మార్చేసి తనపై యాక్షన్ తీసుకోవటానికే ఈడీ పెద్ద కుట్రచేసిందనే వాదనతో కేజ్రీవాల్ పిటీషన్ వేయబోతున్నారు. ఇందుకు అవసరమైన వ్యవహారాలను న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.
చాలాకాలంగా శరత్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కల్వకుంట్ల కవిత సూత్రదారుగా ఈడీ చాలా చార్జిషీట్లలో చెప్పింది. కవితతో పాటు మరికొందరిని పాత్రదారులుగా చెప్పిన ఈడీ అందరినీ అరెస్టులు చేసింది. వారిలో శరత్ చంద్రారెడ్డి కూడా ఒకళ్ళు. చాలాకాలం జైలులో ఉండి బెయిల్ మీద బయటున్న శరత్ కొద్దిరోజులకే తాను అప్రూవర్ గా మారిపోతానని చెప్పారు. ఈ మేరకు సీబీఐకి చెప్పగానే అంగీకరించింది.
ఇదే విషయాన్ని ఈడీ కోర్టులో పిటీషన్ వేసింది. అందుకు కోర్టుకూడా అనుమతించింది. అంటే ఇపుడు శరత్ నిందితుడు కాదు అప్రూవర్ అన్నమాట. ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం నిందితుడిగా ఉన్న శరత్ ఒక్కసారిగా అప్రూవర్ గా ఎందుకు మారాలని అనుకున్నట్లు ? ఎందుకంటే సూత్రదారైన కవితను రక్షిస్తునే మరోవైపు కేజ్రీవాల్ ను ఇరికించేందుకే అనే ప్రచారం పెరిగిపోతోంది. దీనిపైనే కేజ్రీవాల్ కూడా న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.
అందుకనే శరత్ అప్రూవర్ గా మారటాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తు కోర్టులో పిటీషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. ఇంతకాలం శరత్ ను విచారించిన ఈడీ కేవలం తనను కుట్రలో ఇరికించేందుకే అప్రూవర్ గా మార్చినట్లు కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రమొత్తానికి సూత్రదారుగా నరేంద్రమోడిని అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్ధలను చేతిలో పెట్టుకుని మోడీ ప్రత్యర్ధులపై కక్షసాధిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు మోడీపై ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. మరి అప్రూవర్ గా మారిన శరత్ వ్యవహారం ఏమవుతుంది ? కేజ్రీవాల్ పిటీషన్ను కోర్టు ఏ విధంగా పరిగణిస్తుందనేది ఆసక్తిగా మారింది.