ఒక్కోసారి పరిస్థితులు అలా తోసుకొచ్చేస్తాయంతే. విషయం ఒకటే అయినా వివిధ పార్టీలు తమ తమ యాంగిల్లో ఆ విషయాన్ని ప్రచారం చేస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కవితే మూడు పార్టీలకు ప్రచారాస్త్రమయ్యేట్లున్నారు. కవితకు మద్దతుగా అధికార బీఆర్ఎస్ రంగంలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో కవిత అవినీతిని హైలైట్ చేస్తు ఊరూరా ప్రచారం చేయటానికి బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక కాంగ్రెస్ ను చూస్తే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండింటిని కలిపి ఉతికారేసేందుకు రెడీ అయిపోతోంది.
ఈ పాటికే విషయం అర్ధమైపోయుంటుంది. అవును కవిత కేంద్రంగా మూడు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలక సూత్రదారుగా ఈడీ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కోర్టుకు సబ్మిట్ చేసిన అనేక చార్జిషీట్లలో కవిత పాత్ర ఎంత కీలకంగా ఉందో వివరించింది. స్కామ్ లో పాత్రదారులంటు ఇప్పటికే ఈడీ చాలామందిని అరెస్టుచేసింది కానీ కవితను మాత్రం ముట్టుకోవటంలేదు. కవిత అరెస్టయితే కేసీయార్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ నేతలు రెడీగా ఉన్నారు. అయితే అరెస్టు జరగటం లేదు.
ఇక్కడే బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏదో ఒప్పందం జరిగిందనే ప్రచారం పెరిగిపోతోంది. కవితను గనుక ఈడీ అరెస్టు చేస్తే ఆ అరెస్టును అడ్వాంటేజ్ తీసుకుని జనాల్లో సానుభూతి పొందాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కవితను అరెస్టు చేస్తే ఎక్కడ బీఆర్ఎస్ కు సానుభూతి వచ్చేస్తుందో అన్న ఆలోచనలతో అరెస్టును బీజేపీ ఆపినట్లు ఆరోపణలున్నాయి. అంటే కవిత అరెస్టు విషయంలో రెండు పార్టీలకు వాటి వాటి వ్యూహాలున్నాయని అర్ధమవుతోంది.
ఇదే సమయంలో కవిత అరెస్టు కేంద్రంగా బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని కావాలని డ్రామాలు ఆడుతున్నాయంటు కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఇలా ఉంటే ఇక రేపటి ఎన్నికల్లో ఇంకెంతగా రెచ్చిపోతాయో అర్ధంకావటంలేదు.