మేనిఫెస్టో పబ్లిసిటీ… పక్కా ప్లానింగ్ తో!

జనాల ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశంపార్టీ తొందరలోనే వినూత్న కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతోంది. 150 రోజుల పాటు జనాల్లోనే ఉండి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి మహానాడులో మొదటి విడత మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారెంటీ అని పేరుపెట్టారు. అందులో ఆరు పథకాలను చంద్రబాబు ప్రస్తావించారు.

నిరుద్యోగులకు నెలకు రు. 3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు, జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు ఏడాదికి రు. 20 వేలు, 18-59 వయసులోని ఆడపిల్లలు, మహిళలకు నెలకు రు. 1500 పెన్షన్ చంద్రబాబు ప్రకటించారు. మ్యానిఫెస్టోను చంద్రబాబు ఆచరిస్తారా ? ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా ? అని మాత్రం అడక్కూడదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హామీలిచ్చారు జనాలు వినాలంతే.

రాష్ట్రంలోని పేదలందరినీ ధనికులను చేయటానికి తాను కంకణం కట్టుకున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. పేదలను ధనికులుగా ఎలాచేస్తారంటే మాత్రం చెప్పరు. దీనికి పూర్ టు రిచ్ అనే కాన్సెప్టు తయారుచేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ఓ ఐదు పేదకుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలట. ధనికులు దత్తత తీసుకోగానే పేదలు రిచ్ అయిపోతారు కదాన్నది చంద్రబాబు కాన్సెప్టు. బహుశా దీన్ని మరింతగా వివరించి చెబుతారేమో చూడాలి.

ఇప్పటికైతే భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు పార్టీ నేతలంతా 150 రోజులు కష్టపడాల్సిందే అనిచెప్పారు. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ వరకు పార్టీ శ్రేణులు భవిష్యత్తుకు గ్యారెంటీని బాగా ప్రచారంచేయాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీనుండి ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతోంది. ఎన్నికలకు ఎంతో వ్యవధిలేదు కాబట్టి నేతలంతా సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు జనాల్లోకి మ్యానిఫెస్టోను తీసుకెళ్ళాలన్నారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన రూట్ మ్యాప్ ను పార్టీ రెడీచేస్తోంది. భవిష్యత్తులో ప్రకటించే రెండోవిడత మ్యానిఫెస్టోకు అప్పుడు మళ్ళీ మరో కార్యక్రమాన్ని చేపడతారు.