టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు.. చొక్కా చింపేసి మ‌రీ..

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కొండెపి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌నేయ స్వామిని పోలీసులు అత్యంత అమానుష రీతిలో అరెస్టు చేశారు. బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నంలోకి ఎక్కించి ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. నెల్లూరులో ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డిపై దాడి ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే.. ఇలా టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు క‌ల‌క‌లం రేపడం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగిందంటే..

కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి వైసీపీ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. చలో తూర్పు నాయుడుపాలెం అంటూ.. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు.

వైసీపీకి కౌంటర్‌గా చలో టంగుటూరు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వ‌రికూటి అశోక్ బాబు  తీరుని నిరశిస్తూ నాయుడుపాలెం నుంచి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు. అయితే జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగింది. చివరకు ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  మ‌రోవైపు.. జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అన్న ప‌రిస్థితి నెల‌కొన‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.