తెలంగాణ దూకుడుకు ఏపీ పోటీ ప‌డ‌లేక‌పోతోందిగా!

ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ఎంతో న‌ష్ట‌పోయిందని ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు వాద‌న‌కు దిగుతారు.

ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉంద‌ని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వ‌స్తున్నాయ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతారు.

క‌ట్ చేస్తే.. మ‌రి 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా నివేదిక రూపంలో ఇవ్వ‌గ‌ల‌రా? అంటే.. మాత్రం ఏపీ మంత్రులు, ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. కానీ, అదేస‌మ‌యంలో తెలంగాణ మాత్రం నివేదిక‌లు.. లెక్క‌లు .. అంటూ..తాము చేసిన ప్ర‌గ‌తిని చెప్పుకొనేందుకు రెడీ అయింది. దీంతో తెలంగాణ దూకుడు ముందు ఏపీ పోటీ ప‌డ‌లేక‌పోతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2022-23 సంవత్సరానికి తెలంగాణ‌లో ఐటీ రంగం పనితీరుపై మంత్రి కేటీఆర్ నివేదికను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 2015 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నా.. కొన్ని నెలలుగా మంత్రి చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా ఈ ఏడాది నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

దేశానికి హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్న నివేదికలు ఆయా రంగాలలో విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాల నూ వివరిస్తాయి. ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పనలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021-22లో జాతీయ సగటు కంటే 9 శాతం పెరిగి ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం నమోదైంది. మ‌రి దీంతో పోల్చుకుంటే.. గ‌త నాలుగేళ్ల‌లో ఏపీ సాధించింది ఏంటో చెబితే.. జ‌గ‌న‌న్న పాల‌న‌కు ప్ర‌జ‌లు మ‌రింత‌గా జై కొడ‌తారు క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.