టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీలో పర్యటించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇప్పటికే ప్రజలను ఆకర్షించేలా మినీ మేనిఫెస్టోను సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన పొత్తులపై కూడా.. ఒక నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒకటి తేల్చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. ఢిల్లీలో పర్యటించారు.
అయితే.. ఈ ఢిల్లీ పర్యటనలో ఆయనకు ఆది నుంచి చివరి వరకు కూడా వైసీపీ రెబల్ ఎంపీ ఆహ్వానం పలకడం.. ఏర్పాట్లు చేయడం.. అమిత్ షా తో భేటీ అయిన తర్వాత.. రిసీవ్ చేసుకోవడం వంటివి చేశారు. అదేవిధంగా చంద్రబాబు కు ఆహారాన్నిసైతం ఏర్పాటు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉన్నప్పటికీ.. రఘురామరాజే వీరందరి కంటే ముందుగా ఎరైవల్ బ్లాక్ వద్ద నిలబడి చంద్రబాబుకు స్వాగతం పలికారు.
దీంతో రఘురామరాజు ప్రత్యక్షంగా ఈ స్థాయిలో చంద్రబాబుకు ఆహ్వానం పలకడం.. ఆయన వెంటే ఉండడం వంటివి తొలిసారని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడం.. టీడీపీ గెలుపుపై సంకేతాలు వస్తున్నందున.. ఎంపీ రఘురామ రూటు మార్చుకున్నారని కూడా చెబుతున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైన సీఎం జగన్.. తన బాబాయ్ వై.ఎస్.భాస్కరరెడ్డికి జైల్లో ప్రత్యేక హోదా వచ్చేలా ఢిల్లీ పెద్దలను ఒప్పించగలిగారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు.
త్వరలోనే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ప్రజలకు తీర్పును ఇచ్చే అవకాశం లభిస్తుందన్నారు. సీఎం జగన్ నిబంధనలు అతిక్రమిస్తూ కేంద్ర సర్వీసుల్లోని జూనియర్ కేడర్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి కీలక బాధ్యతలు కట్టబెడుతుంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించరా అని అన్నారు. టీటీడీ ఈవో పోస్టు ఐఏఎస్ అధికారుల హక్కని, ఆ పోస్టులో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డిని నియమించారన్నారు.
రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా 2009 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణకు కట్టబెట్టడం సరికాదన్నారు. భీమవరం నుంచి పోటీచేయాలని పవన్‌ను కోరుతున్నట్లు చెప్పారు. మంచి మనిషిని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని, ఈ దఫా ఆయనకు 60 వేలకు పైగా మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates