రేవంత్ పై విరుచుకుపడిన బండి..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధికారపక్షంపై విరుచుకుపడే ఆయన.. ఈసారి అందుకు భిన్నంగా రేవంత్ పై ఎక్కువగా గురి పెట్టటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగే వ్యాఖ్యలు చేసే ఆయన.. తాజాగా రేవంత్ పై తన గురి పెట్టారు. రేవంత్ లా పార్టీలు మారటంతనకు చేతకాదన్నారు.

“ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచటం నా వల్ల కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి.. కోమటిరెడ్డి.. జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుంది. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతుల్లో ఉందో అర్థమవుతుంది. మా దగ్గర సీనియర్లు బాస్ లు.. అదే కాంగ్రెస్ పార్టీలో హోంగార్డులు. హుజూరాబాద్ దుబ్బాక.. జీహెచ్ ఎంసీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపటం రాకుంటే ఎలా గెలుస్తాం. మాది గెలుపుల పరంపర. కాంగ్రెస్ వాళ్లది ఓటమి పరంపర. డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోంది. ముసుగులు వేసుకొని తిరిగే పార్టీ కాదు మాది’’ అంటూ రేవంత్ పైనా.. తెలంగాణ కాంగ్రెస్ మీదా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని వదల్లేదు బండి సంజయ్. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదన్న బండి.. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్ కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలని సవాలు విసిరారు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని.. తెలంగాణ ఆవిర్భావాన్ని కూడా అధికారికంగా నిర్వహించినట్లుగా పేర్కొన్నారు కేంద్రాన్ని ఒప్పించి మరీ గోల్కొండలో అధికారికంగా నిర్వహించిన సమర్థత కిషన్ రెడ్డిదన్నారు. మరి.. బండి చేసిన వ్యాఖ్యలకు మజ్లిస్ అధినేత ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.