సబితకు ఇంటిపోరు పెరిగిపోతోందా?

చేవెళ్ళ చెల్లెమ్మగా ఎంతో పాపులరైన సబితా ఇంద్రారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమనే ప్రచారం పెరిగిపోతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించగానే చెల్లెలుకు కేసీయార్ మంత్రిపదవి కూడా ఇచ్చేశారు. ఇపుడు సమస్య ఏమిటంటే మంత్రి అనుచరులు, మద్దతుదారులకే మొత్తం కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయని బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మంత్రిపేరు చెప్పుకుని భూకబ్జాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయట.

దాంతో తనతో పాటు తన మద్దతుదారులపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోవటంలేదని నేతలు మండిపోతున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ లో మొదటినుండి ఉన్న నేతలు, ఉద్యమకారులు దూరమైపోతున్నారు. అయినా మంత్రి ఎవరినీ పట్టించుకోవటంలేదు. కేసీయార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళనా, కేటీయార్ తో ఫిర్యాదుచేసినా కూడా ఎలాంటి ఉపయోగం కనబడలేదట.

అనుచరుల ఆగడాలను మంత్రి చూస్తు ఊరుకున్నారంటే ఆమెకు కూడా ఇందులో భాగముందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మద్దతుదారులు చెరువులు, కుంటలను కూడా వదలటంలేదట. సబిత వైఖరిపై ప్రతిపక్షాలు గోలచేయటం కాదు చివరకు పార్టీలోని స్వపక్షం నేతలు కూడా గోల గోల చేసేస్తున్నారు. అయినా ఎటునుండి పరిస్ధితిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరగటంలేదట. మహేశ్వరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను ఒకేరకమైన పరిస్ధితులున్నట్లు చెబుతున్నారు. పార్టీలోని కీలకనేతలు కొత్తా మనోహర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి కూడా సబిత వ్యవహారశైలిపై బాహాటంగానే ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయినా మంత్రి ఎవరినీ లెక్కచేయటంలేదు.

సబితా తాను కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో చేరి మంత్రయిన తర్వాత కొందరిని పార్టీలో చేర్పించారు. తుక్కుగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్, బీజేపీ నేత, బడంగ్ పేట ఛైర్ పర్సన్, కాంగ్రెస్ నేత పారిజాత బీఆర్ఎస్ లో చేరి పదవులు అందుకున్నారు. ఇపుడు వీళ్ళు కూడా సబితకు వ్యతిరేకంగానే తయారయ్యారు. సబిత వైఖరిని తట్టుకోలేక చివరకు మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ తమ పార్టీల్లోకి వెళిపోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇంటా బయట కూడా వ్యతిరేకతను పెంచేసుకుంటున్న సబిత వచ్చేఎన్నికల్లో మహేశ్వరంలో గెలుస్తారా అన్న డౌటు పెరిగిపోతోంది.